వర్షం పడితే నేల పరిమళిస్తుంది.. ఆ నేలలో ఒక మొక్క నాటితే భవిష్యత్తు పరిమళిస్తుంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న అడవుల నేపథ్యంలో పచ్చదనమే భూమికి రక్షా కవచం. నేడు నాటిన చిన్న మొక్కే రేపటి తరాలకు జీవనాధారంగా, ప్రకృతికి చిరునవ్వుగా, భూమికి శాశ్వతమైన కానుకగా నిలుస్తుంది.
తెలంగాణలో ఈ వర్షాకాలంలో ప్రభుత్వం చేపట్టిన హరిత హారం, ‘ఏక్ పేడ్ మా కే నామ్’, గ్రీన్ ఇండియా చాలెంజ్, పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో హరిత ఉద్యమం కొత్త ఊపును సంతరించుకుంది. నాటిన ప్రతి మొక్క భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం, సుస్థిరమైన భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. ఈ ఏడాది ఎల్ నినో నేపథ్యంలో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలు, హరిత క్లబ్‌లు, గో గ్రీన్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, మార్పు ఫౌండేషన్.. ఇలా ఎన్నెన్నో క్లబ్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థుల నుంచి పెద్దల దాకా అందరూ మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంచేందుకు తోడ్పడుతున్నారు.
తల్లి పేరుతో ఒక మొక్క
‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరు మీద ఒక చెట్టు) నాటండి అంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2024వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి గౌరవార్థం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించాలనేది ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశ్యం. మీ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కతో దిగిన ఫొటోను అధికారిక మై భారత్ పోర్టల్ లేదా ప్రత్యేక యాప్ ద్వారా అప్‌లోడ్ చేయొచ్చు. తెలంగాణలో పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటడం అనేది కొనసాగుతోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి, పచ్చదనాన్ని ప్రోత్సహించడానికి చాలామంది తమ పుట్టినరోజున దేశీయ చెట్లను నాటుతున్నారు. దీంతోపాటు గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి రాష్ట్రవ్యాప్త హరిత కార్యక్రమాలు సాగాయి. వేప, జమ్మి లేదా గుల్మొహర్ వంటి వేగంగా పెరిగే మొక్కలను పెరట్లో, కమ్యూనిటీ పార్కుల్లో నాటారు.
స్వచ్ఛంద సంస్థల హరిత సేవ
తెలంగాణలో చెట్ల విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33శాతానికి పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో హరిత వీరులు మొక్కలు నాటుతూ పచ్చదనం కోసం పాటుపడుతున్నారు. దీనికి ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ యాదాద్రి మోడల్ అడవుల పెంపకాన్ని చేపట్టింది. మరో స్వచ్ఛంద సంస్థ గ్రో బిలియన్ ట్రీస్ హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పట్టణ అడవుల పెంపకం, ఆగ్రోఫారెస్ట్రీకి కృషి చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా సరస్సులు, చెరువుల పునరుద్ధరణతోపాటు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సంకల్పతరు ఫౌండేషన్ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో నాణ్యమైన మొక్కలను నాటడం, జియో-ట్యాగింగ్ ద్వారా వాటిని పర్యవేక్షించడం వంటి ఆధునిక పద్ధతులను అమలుచేస్తోంది.
యూత్ ఫర్ సేవా సంస్థ విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పలు సామాజిక వన మహోత్సవాలు, మొక్కల పంపిణీ డ్రైవ్‌లను చేపడుతోంది. ధ్రువాంశ్ ఆర్గనైజేషన్ పర్యావరణ స్థిరత్వం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థానికంగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థలు, స్థానిక పర్యావరణ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచితంగా మొక్కలను పంపిణీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ మెట్రో పరిధిలో పెద్ద బ్లాక్ ప్లాంటింగ్‌లు, అవెన్యూ గ్రీనరీ, ట్రీ పార్కులను ఏర్పాటు చేసింది. వాటా ఫౌండేషన్ నిర్మాణ ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన పెద్ద చెట్లను రక్షించి, వాటిని వేరే చోటికి తరలించడంలో ముందుంది. మార్పు ఫౌండేషన్ పట్టణ వృక్షారోపణ డ్రైవ్‌లను నిర్వహిస్తుంది. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మియావాకి- శైలి అటవీ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టింది.
హరిత బృందాల చైతన్యం
తెలంగాణ వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలలు క్యాంపస్‌లలో విద్యార్థులు మొక్కలు నాటడంతోపాటు వాటిని దత్తత తీసుకొని సంరక్షిస్తున్నారు. విద్యార్థులకు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో మార్గనిర్దేశం చేయడానికి, ఉపాధ్యాయుల నేతృత్వంలో ప్రకృతి క్లబ్‌లు, హరిత బృందాలు ఏర్పాటు అయ్యాయి. పాఠశాల మైదానంలో కేటాయించిన మొక్కలకు నీరు పోయడం, రక్షించడం, పెంచడం వంటి వ్యక్తిగత బాధ్యతను విద్యార్థులు తీసుకుంటున్నారు. కాలుష్యాన్ని తగ్గించడం గురించి సమాజానికి అవగాహన కల్పించడానికి పిల్లలు స్థానికంగా ర్యాలీలు నిర్వహించారు. పర్యావరణ అనుకూల ప్లకార్డులను పట్టుకుని వీధి నాటకాలు ప్రదర్శించారు. విద్యార్థులు వారి ఇళ్లలో నాటుకోవడానికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ‘‘ఒక బిడ్డ ఒక మొక్క, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి’’ వంటి ప్రచారాలతో హరిత కార్యక్రమాలు సాగుతున్నాయి.
జియోట్యాగ్ ట్రాకింగ్
నాటిన ప్రతి 4 అడుగుల చెట్టుకు మూడు సంవత్సరాలు సంరక్షణ అందించడంతో పాటు, పారదర్శకత కోసం జియోట్యాగ్ ట్రాకింగ్‌ను కూడా చేపట్టారు.హైదరాబాద్‌లో మొక్కల పెంపకాన్ని ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు చేపట్టి వారు హరిత క్యాంపస్‌లను సృష్టించడానికి పర్యావరణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. కార్పొరేట్ ప్రాంగణాలలో ఫుడ్ ఫారెస్ట్‌లను సృష్టించారు. వనమహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుర్రంగూడ ఎకోపార్క్‌లో ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం ఎకో పార్క్‌లో మొక్కను నాటారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి రూ.35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. వనమహోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేసింది. హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో నగరంలోని 44 నర్సరీల ద్వారా ఒక్కో కుటుంబానికి 5 ఉచిత మొక్కల చొప్పున పంపిణీ చేశారు. పండ్లు, ఔషధ గుణాలున్న మొక్కలు, అలంకరణ మొక్కలను అందజేశారు. ఈ ఏడాది16 కోట్ల వరకు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు.
మొక్కను నాటడం ఒక రోజు చేసే పని మాత్రమే, దాన్ని పెంచి సంరక్షించడం నిజమైన పర్యావరణ సేవ. ప్రతి మొక్క పెరిగేకొద్దీ భూమికి చల్లదనం, మనిషికి ఆరోగ్యం, జీవజాతికి ఆశ్రయం లభిస్తాయి. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తే పచ్చని తెలంగాణ మన సొంతమవుతుంది.
గంటలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్
గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా వాలంటీర్లు పాల్గొని, కేవలం ఒక్క గంటలోనే 3.61 లక్షల మొక్కలను నాటారు. ఈ అద్భుత విజయంతో ఒక్క గంటలో అత్యధిక మొక్కలను నాటిన నగరంగా అహ్మదాబాద్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలిచింది. తెలంగాణలో మొక్కలు నాటడంలో రాష్ట్రానికి హరితహారం కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు లభించింది. 2015లో ప్రారంభమైన హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటారు. దేశంలో నాటిన ప్రతి ఐదు మొక్కల్లో ఒకటి తెలంగాణలోనే నాటారని, మొక్కలు నాటడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి వెల్లడించారు.
పర్యావరణ ప్రయోజనాలు
మొక్కలు నాటిన ప్రాంతాల్లో వాయు కాలుష్యం 30 నుంచి 40 శాతం వరకు తగ్గుతుంది. చెట్లతో కప్పి ఉన్న జోన్‌లలో ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుంది. గాలి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతుంది. వేర్ల వ్యవస్థల ద్వారా భూగర్భ జలాల పునరుత్పత్తి మెరుగుపడుతుంది.
గో గ్రీన్..
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం హరిత హారంలో భాగంగా ఇటీవల వివిధ రకాల పండ్లు, పూల మొక్కలకు చెందిన 2000 మొక్కలను నాటారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పారిశ్రామిక భాగస్వాములు, ప్రభుత్వ విద్యా సంస్థలు, సంఘాలు, పాఠశాలల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ప్రాంగణాలు, రహదారుల పక్కన ఉన్న మార్గాలు, బీడు కొండలు, చెరువు గట్లు, సంస్థల మైదానాలు, నదీ, కాలువల ఒడ్డున, గృహ సముదాయాలు, పారిశ్రామిక పార్కులు వంటి అటవీయేతర ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
