అడవిని అమ్మగా, ప్రకృతిని ఆరాధ్యంగా భావించే ఆదివాసీల జీవన విధానం నాగరిక సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. కాలం మారుతున్నా, సాంకేతికత విస్తరిస్తున్నా గిరిజన ప్రాంతాల్లో అనేక సంప్రదాయాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి సంస్కృతి, ఆచారాలు, ప్రకృతితో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రతిబింబించే కొన్ని విశిష్ట అంశాలపై ప్రత్యేక కథనం.
గోండు ఆదివాసీల సంస్కృతిలో దండారి పండుగకు విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ గుస్సాడి నృత్యం. నెమలి ఈకల కిరీటాలు, సంప్రదాయ ఆభరణాలు, ప్రత్యేక వేషధారణతో కళాకారులు గ్రామాలన్నీ తిరుగుతూ నృత్యాలు చేస్తారు. ఇది కేవలం వినోదం కోసం కాదు.. గోండు సంస్కృతి, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ కళను దేశవ్యాప్తంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడి కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది.
పెళ్లి అంటే ఊరంతా పండుగ
ఆదివాసీ సమాజంలో వివాహం రెండు కుటుంబాల కార్యక్రమం మాత్రమే కాదు.. గ్రామమంతా కలిసి నిర్వహించే శుభకార్యం. పెళ్లికి ముందు గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి గ్రామ శివారులో ముహూర్తం నిర్ణయించడం ప్రత్యేక సంప్రదాయం. పెద్దల ఆశీర్వాదంతోనే వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆధునిక కాలంలో జ్యోతిష్యులు, ముహూర్తాలపై ఆధారపడుతున్నా ఆదివాసీలు మాత్రం తమ పూర్వీకుల సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు.
అడవే ఆస్తి..
అడవిలో లభించే బోడకాకరకాయలు, పుట్టగొడుగులు, వెదురు చిగుళ్లు, ఉసిరి, ఇప్ప పువ్వు, తేనె వంటి వన ఉత్పత్తులను సేకరించి మార్కెట్‌లో విక్రయించడం అనేక ఆదివాసీ కుటుంబాలకు జీవనాధారంగా మారింది. ముఖ్యంగా బోడకాకరకాయలకు పట్టణాల్లో మంచి డిమాండ్ ఉండటంతో అదనపు ఆదాయం లభిస్తోంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అటవీ ప్రాంతాల్లో ఇవి లభిస్తాయి. కొన్ని కుటుంబాలకు మాత్రమే ఈ మొక్కలు పెరిగే ప్రదేశాలు తెలిసి ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే ఈ అరుదైన వన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ లభించే అవకాశం ఉంది.
నృత్యాలతో చివరి వీడ్కోలు
మరణం కూడా ఆదివాసీల సంస్కృతిలో ఒక ప్రత్యేక ఆచారమే. దహన సంస్కారం అనంతరం చితి చుట్టూ బంధువులు, గ్రామస్థులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ మృతునికి చివరి నివాళి అర్పిస్తారు. మృతుని ఆత్మ పూర్వీకుల్లో కలవాలని కోరుతూ ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆదిలాబాద్ ఆదివాసీల జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మానవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ కూడా తన మరణానంతరం ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరపాలని కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు మర్లవాయి గ్రామంలో సమాధి ఏర్పాటు చేసి ప్రతి ఏడాది జనవరి11న ఆదివాసీలు నివాళులు అర్పిస్తున్నారు.
ప్రకృతే ఆటస్థలం
గిరిజన చిన్నారులు వెదురు కర్రలతో నడిచే సంప్రదాయ ఆటలు ఆడుతూ పెరుగుతారు. ఖరీదైన ఆటబొమ్మలు లేకపోయినా ప్రకృతే వారికి ఆటస్థలం, వెదురే ఆటబొమ్మ. ఈ ఆటలు శారీరక దృఢత్వం, సమతుల్యత, ధైర్యాన్ని పెంపొందిస్తాయి.
బండరాయి తిరుగుతూనే...
మిక్సీలు, గ్రైండర్లు అందుబాటులోకి వచ్చినా అనేక గిరిజన కుటుంబాల్లో ఇప్పటికీ బండరాయితోనే జొన్నలు, సజ్జలు, మక్కలు, సామలు విసురుతారు. ఇలా చేయడం వల్ల చిరుధాన్యాల సహజ రుచి, పోషక విలువలు నిలిచి ఉంటాయని పెద్దలు విశ్వసిస్తారు. ఇది వారి ఆరోగ్యకరమైన జీవనశైలికి నిదర్శనం.
సంస్కృతి పరిరక్షణే నిజమైన సందేశం
ప్రపంచం వేగంగా మారుతున్న ఈ కాలంలో ఆదివాసీల సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతితో సహజీవనం, సమిష్టి జీవనం, పరస్పర సహకారం వంటి విలువలను ప్రపంచానికి చాటి చెప్పే ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి నిజమైన సందేశం.
- సోయం దినకర్, జైనూర్, వెలుగు
