- బానిసలవుతున్న యువకులు, విద్యార్థులు
- కుటుంబాలపై దాడులు
- పారిశ్రామిక ప్రాంతాల్లో జోరుగా
- ఎండుగంజాయి, చాక్లెట్లు, సిగరేట్ల విక్రయాలు
మెదక్/శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లాలో జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్రమార్జనకు అలవాటు పడిన కేటుగాళ్లు హైదరాబాద్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కిలోల కొద్దీ గంజాయిని రహస్యంగా తెచ్చి జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్న ప్యాకెట్లలో నింపుతూ, కొన్ని చోట్ల ఏకంగా గంజాయి చాక్లెట్లు, సిగరేట్ల రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది యువకులు గంజాయి బానిసలుగా మారుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. మత్తులో కుటుంబ సభ్యుల పై దాడులు చేస్తున్నారు.
కంపెనీలు ఉన్న మండలాల్లో ఎక్కువ
ప్రధానంగా కంపెనీలు ఎక్కువగా ఉన్న శివ్వంపేట, నర్సాపూర్, మనోహరాబాద్, చిన్నశంకరంపేట, చేగుంట మండలాల్లో గంజాయి అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువ శాతం మంది బీహార్, యూపీ, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా గంజాయి వినియోగిస్తున్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి సీక్రెట్ గా ఎండు గంజాయి తీసుకు వచ్చి 50 నుంచి 100 గ్రాముల చిన్న, చిన్న పాకెట్లుగా చేసి ఆయా ప్రాంతాల్లోని హోటల్ లు, పాన్ షాప్, కిరాణా షాప్ లలో విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించేందుకు స్థానికంగా కొందరిని నియమించుకుంటున్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు పట్టుబడకుండా ఉండేందుకు కొన్ని చోట్ల చాక్లెట్ లు, సిగరేట్ల రూపంలో కూడా గంజాయి అమ్ముతున్నారు. ఈ పరిస్థితి శివ్వంపేట మండలం దొంతి, గోమారం, శభాష్ పల్లి, గూడూరు, శివ్వంపేట, చండి, అల్లిపూర్, చిన్న గొట్టిముక్కుల, పోతుల బొగుడ గ్రామాల్లో ఎక్కువగా ఉంది.
యువకులు, విద్యార్థులు సైతం...
ఆయా ప్రాంతాల్లో కంపెనీల్లో పనిచేసే కార్మికులతోపాటు స్థానిక యువకులు, విద్యార్థులు సైతం గంజాయి సేవిస్తూ ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. కొన్ని నెలల కింద గోమారం గ్రామ శివారులో ఒక చెట్టు దగ్గర స్టూడెంట్స్, యువకులు గంజాయి సిగరెట్లు తాగుతుండగా గ్రామస్తులు చూశారు. వారిని చూసి అక్కడే గంజాయి ప్యాకెట్, సిగరెట్లు వదిలేసి పారిపోయారు. కొందరు జులాయిగా తిరుగుతూ గంజాయికి బానిసలుగా మారి, డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులపై దాడి చేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారు. శివ్వంపేట మండలంలోని ఆయా గ్రామాల నుంచి పోలీసులకు తమ పిల్లలు కొడుతున్నారని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.
ఇటీవల ఘటనలు..
జులై 8న గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను నర్సాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 870.6 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించే జిప్‌లాక్ కవర్లు ఇతర వస్తువులు కూడా లభించాయి.
జులై 8న శివ్వంపేట మండల కేంద్రంలో తూప్రాన్ నర్సాపూర్ రహదారి పక్కన భారత్ గ్యాస్ గోదాం దగ్గరలో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి శభాష్ పల్లికి చెందిన గణేశ్, తూప్రాన్ కు చెందిన హమేత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర 33 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా శనివారం నార్సింగి మండల కేంద్రంలో టాస్క్ ఫోర్స్ టీమ్ దాడి చేసి బీహార్ కు చెందిన వ్యక్తి వద్ద రూ. లక్ష విలువైన రెండు కిలోల ఎండు గంజాయి, 150 గంజాయి చాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
గంజాయి రవాణా చేయడం, అమ్మడం నేరం. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. - గోపాల్, జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ
