అంతర్జాతీయంగా పోచంపల్లి ఇక్కత్‌ను ప్రమోట్‌ చేస్తం..సెప్టెంబర్‌ 26న బ్రిటన్‌ పార్లమెంట్‌లో చేనేతపై సందేశం

అంతర్జాతీయంగా పోచంపల్లి ఇక్కత్‌ను ప్రమోట్‌ చేస్తం..సెప్టెంబర్‌ 26న బ్రిటన్‌ పార్లమెంట్‌లో చేనేతపై సందేశం
  • మిస్‌ ఆసియా రష్మీ ఠాకూర్‌

 భూదాన్‌ పోచంపల్లి, వెలుగు: పోచంపల్లి ఇక్కత్‌ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామని మిస్‌ ఆసియా రష్మీ ఠాకూర్‌ తెలిపారు. శనివారం భూదాన్‌ పోచంపల్లిలో నిర్వహించిన ‘ఎక్స్​పీరియన్స్‌ పోచంపల్లి’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మల్టీనేషనల్‌ కంపెనీలు, ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ ప్రతినిధులతో కలిసి టూరిజం పార్కులో ఇక్కత్‌ వస్త్రాల చరిత్ర, తయారీ విధానం, మగ్గాల పనితీరును తెలుసుకున్నారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. అనంతరం శివారెడ్డిగూడెంలో వ్యవసాయ కూలీలతో సరదాగా గడిపారు. 

సెప్టెంబర్‌ 26న బ్రిటన్‌ పార్లమెంట్‌లో 15 నిమిషాల సందేశం ఇచ్చే అవకాశం వచ్చిందని రష్మీ ఠాకూర్‌ తెలిపారు. ఇందులో 10 నిమిషాలు చేనేత పరిశ్రమ ప్రమోషన్‌కు కేటాయించనున్నట్లు చెప్పారు. నూతన డిజైన్లతో బ్లేజర్లు, ట్రౌజర్లు, ఆధునిక దుస్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు పెంచాలన్నారు. మార్కెటింగ్‌ ఏజెన్సీల ఏర్పాటు, పోచంపల్లి టూరిజం అభివృద్ధిపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో విదేశీ పర్యాటకులు పోచంపల్లిని సందర్శిస్తారని చెప్పారు.