ఆసిఫాబాద్, వెలుగు: అగ్రికల్చర్ ఆఫీసర్‌ను బెదిరించి రూ.1.30లక్షలు వసూలు చేసిన ఇద్దరు సోషల్‌మీడియా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
దహెగాం మండలానికి చెందిన బుతే దేవేందర్(మెదక్టుడే), డుప్త సురేశ్(సూరన్న టీవీ) ముఠాగా ఏర్పడి అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడేవారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖను టార్గెట్ చేసి కొన్ని రోజుల కింద వీడియోలు ప్రచారం చేశారు.
దేవేందర్‌కు అదే మండలానికి చెందిన రాధిక ట్రేడర్స్ యజమానితో విభేదాలున్నాయి. దీంతో అతని షాపును మూసివేసేందుకు సురేశ్‌తో కలిసి వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ దుకాణానికి లైసెన్సులు, రికార్డులు సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వారు ఫోన్ కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటిని బెదిరించి రూ.20లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో జూలై 26న రూ.1.30 లక్షలు తీసుకున్నారు. అనంతరం ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆసిఫాబాద్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సురేశ్ గతంలోనే ఓ పోక్సో కేసులో బాలిక వివరాలు, వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన ఆరోపణలపై కేసు నమోదై విచారణలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
