జెన్ జీది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎరా. కానీ ఇప్పుడు కూడా ‘స్నెయిల్ మెయిల్’ కోసం ఎదురుచూస్తోంది ఈ తరం. ‘‘మీకు కొత్త మెసేజ్ వచ్చింది..” అని మొబైల్ స్క్రీన్‌పై ఈ నోటిఫికేషన్ రోజుకు వందసార్లు కనిపించొచ్చు. వాట్సాప్‌లో ఒక ‘హాయ్’, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్, జీమెయిల్‌లో ఒక మెయిల్.. అన్నీ క్షణాల్లో వచ్చేస్తున్నాయి. కానీ వీటిలో ఎన్ని మనసును తాకుతున్నాయి? ఎన్ని జ్ఞాపకాలుగా మిగులుతున్నాయి? అనేది క్వశ్చన్ మార్కే!
అందుకేనేమో.. ప్రపంచం డిజిటల్ వేగంతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో, అదే డిజిటల్ తరంగా పేరొందిన జెన్ జీ ఇప్పుడు ఓ పాత అలవాటుకు మళ్లీ ప్రాణం పోస్తోంది. అదే.. చేత్తో రాసిన లేఖ. ఒకప్పటి కాలం చెల్లిపోయిందనుకున్న ‘స్నెయిల్ మెయిల్’ ఇప్పుడు మళ్లీ కొత్త తరం హృదయాలను తడుముతోంది.ఒకప్పుడు ఇంటి ముందు సైకిల్‌పై తపాలా బంట్రోతు కనిపిస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఒక ఉత్సుకత కనిపించేది. ‘మనకేమైనా లేఖ వచ్చిందా?’ అనే ఆశ ప్రతి ఇంటి గుమ్మంలో ఉండేది.
లేఖ అంటే కేవలం సమాచారం కాదు. అది దూరంగా ఉన్న మనిషి ప్రేమ, ఆప్యాయత, జ్ఞాపకాలు, ఆత్మీయతను మోసుకొచ్చే మెసెంజర్. ఆ లేఖను ఎన్నిసార్లు చదివినా కొత్తగానే అనిపించేది. అలాంటి అనుభూతిని ఈ తరం ఎప్పుడూ చూడలేదనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు అదే అనుభూతిని వెతుక్కుంటోంది యువత.
రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్.. స్క్రీన్‌ల మధ్యే గడిచిపోతున్న జీవితం యువతను మానసికంగా అలసటకు గురిచేస్తోంది. వేల సందేశాలు వస్తున్నా, వాటిలో వ్యక్తిగత స్పర్శ కనిపించడం లేదు. ‘Seen’, ‘Typing..’, ‘Delivered’ అనే పదాలు భావోద్వేగాలను భర్తీ చేయలేకపోతున్నాయి. అందుకే కొంతమంది యూత్ డిజిటల్ ప్రపంచానికి కాసేపు దూరంగా వెళ్లి, కాగితంపై అక్షరాలను వెతుక్కుంటున్నారు.
ఈ ఆసక్తిని గుర్తించిన కొన్ని సంస్థలు, కమ్యూనిటీలు ‘స్నెయిల్ మెయిల్ క్లబ్‌లు’ ప్రారంభించాయి. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రతి నెలా అందంగా అలంకరించిన చేతిరాత లేఖలు, గ్రీటింగ్ కార్డులు, బుక్‌మార్క్‌లు, స్టిక్కర్లు, ప్రత్యేక స్టేషనరీ వంటివి పంపిస్తున్నారు. ఒక అపరిచితుడు రాసిన లేఖ కూడా కొత్త స్నేహానికి నాంది పలుకుతోంది. కొందరు ప్రపంచంలోని వివిధ దేశాల్లోని యువతతో ‘పెన్ ఫ్రెండ్స్’గా మారి, ఆలోచనలు, అనుభవాలు, కలలను లేఖల ద్వారా పంచుకుంటున్నారు.
ఈ ట్రెండ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యువత కేవలం లేఖలు చదవడం మాత్రమే కాదు, వాటిని అందంగా రాయడాన్ని కూడా ఒక కళగా భావిస్తోంది. ప్రత్యేక కాగితాలు కొనడం, ఫౌంటెన్ పెన్‌తో రాయడం, కవర్లను అలంకరించడం, మైనపు ముద్రలు వేయడం, చిన్న పూలను లేదా జ్ఞాపకాలను లేఖలో జతచేయడం వంటి అలవాట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఒక లేఖను తయారుచేయడమే వారికి ఓ సృజనాత్మక అనుభవంగా మారుతోంది.
మనోవిజ్ఞాన నిపుణుల అభిప్రాయం ప్రకారం, చేతిరాతతో రాయడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది. ఎదుటివారి కోసం సమయం కేటాయించడం వల్ల అనుబంధాలు మరింత బలపడతాయి. డిజిటల్ సందేశాల్లో కనిపించని వ్యక్తిగత స్పర్శ, చేతిరాత లేఖల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఒక చిన్న లేఖ కూడా ఎన్నో మాటలు చెప్పగలుగుతుంది.
ఇది కేవలం పాత జ్ఞాపకాలపై ప్రేమ కాదు. వేగం మధ్యలో నెమ్మదిని వెతుక్కోవాలనే ప్రయత్నం. కృత్రిమ మేధస్సు, ఆటోమెటిక్ మెసేజ్‌లు, ఎమోజీల మధ్య నిజమైన భావోద్వేగాన్ని మళ్లీ అనుభవించాలనే తపన. అందుకే డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన జెన్ జీ, అనలాగ్ ప్రపంచాన్ని కొత్త కళ్లతో చూస్తోంది.
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే..కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
