నిర్మల్: మళ్లీ మఫ్టీ పోలీసింగ్..దొంగలు, నేరస్తులను పట్టుకునేందుకు పకడ్బందీ చర్యలు

నిర్మల్: మళ్లీ మఫ్టీ పోలీసింగ్..దొంగలు, నేరస్తులను పట్టుకునేందుకు పకడ్బందీ చర్యలు
  •     నిర్మల్ పట్టణంలో ఏడు చోట్ల చెక్ పోస్టుల ఏర్పాటు
  •     శివారు ప్రాంతాల్లో నాకాబందీ..
  •     కొత్త వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న  దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టి, ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో కొనసాగిన మఫ్టీ పోలీసింగ్ విధానాన్ని ఎస్పీ జానకీ షర్మిల మళ్లీ తెరపైకి తెస్తున్నారు. పోలీసు శాఖలో చురుగ్గా పనిచేసే యువ కానిస్టేబుళ్లతో కూడిన బృందాలను రంగంలోకి దించబోతున్నారు. వీరంతా ఇకనుంచి మఫ్టీలో సాధారణ యువకుల్లాగా ప్రధాన కూడళ్లతో పాటు శివారు ప్రాంతాల్లో సంచరిస్తూ దొంగలు, నేరస్తుల కదలికలను, వారి కార్యకలాపాలను పసిగట్టనున్నారు. 

ఇండ్లు, దుకాణాలు, ఆలయాల్లో వరుస చోరీలు

పోలీసులు గతంలో మఫ్టీలో ఉంటూ దొంగలతో పాటు సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారి కదలికలను గమనిస్తూ వెంటనే అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించేవారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేవారు. అయితే కొంతకాలంగా మఫ్టీ పోలీస్ వ్యవస్థ కార్యకలాపాలు దాదాపు తగ్గిపోయాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా తగ్గిపోవడంతో దొంగతనాలు వరుసగా పెరుగుతున్నాయి. చైన్​ స్నాచింగ్, ఇండ్ల తాళాలు పగులగొట్టడం, దుకాణాలు, ఆలయాల్లో చోరీలకు పాల్పడడం లాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీ పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు.

ఏడు కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు

దొంగతనాలను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు నిర్మల్ పట్టణ పరిధిలోని 7 కీలక ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులను ఏర్పాటు చేశారు. చోరీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను నియంత్రించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ ముమ్మరం చేసి, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గాజులపేట్ శివారు, సెయింట్ థామస్ స్కూల్ ప్రాంతం, సిద్ధాపూర్, సోఫీ నగర్ దర్గా ప్రాంతం, మహాలక్ష్మి ఆలయం ప్రాంతం, వైఎస్ఆర్ కాలనీ రోడ్, మంజులాపూర్​లో చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ ల వద్ద 24 గంటల పాటు పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండి వాహనాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగిస్తారు.

దొంగతనాల కట్టడికి పకడ్బందీ చర్యలు

దొంగతనాల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నేరాలకు పాల్పడే వ్యక్తులకు ఎలాంటి అవకాశం లేకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నేరాల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రజలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
-జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్