- సర్వం సిద్ధం.. 200 మంది పోలీసులతో బందోబస్తు
కోల్బెల్ట్,వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని బొక్కలగుట్ట పులిమడుగు పాలవాగు బ్రిడ్జి సమీపంలో కొలువుదీరిన గాంధారి మైసమ్మ ఆలయం ఆషాఢ మాస బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ, క్యాతనపల్లి మున్సిపాలిటీఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 700 ఏండ్ల చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాలో గిరిజనుల ఆరాధ్యదైవం గాంధారి మైసమ్మ తల్లి కొలువుదీరింది.
నేషనల్ హైవే నుంచి సుమారు 4 కి.మీ. దూరంలో మైసమ్మ తల్లి ఆలయం ఉండటంతో భక్తులకు దూరాభారాన్ని తగ్గించేందుకు 2004లో బొక్కలగుట్ట బస్స్టేజీ వద్ద ఆలయాన్ని నిర్మించారు. గత 23 ఏండ్లుగా ఏటా ఆషాడ మాసంలో ఆలయం వద్ద బోనాల జాతర నిర్వహిస్తున్నారు. జాతరకు వేలాది భక్తులు తరలివచ్చి జంతు బలులిచ్చి వనభోజనాలు చేస్తారు. భక్తుల కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, మందమర్రి సీఐ రమేశ్ తెలిపారు.
