వరి వేసి నష్టపోవద్దు ..ఆరుతడి పంటలపై దృష్టి పెట్టండి.. మంత్రి కోమటిరెడ్డి

వరి వేసి నష్టపోవద్దు ..ఆరుతడి పంటలపై దృష్టి పెట్టండి.. మంత్రి కోమటిరెడ్డి
  •  2028 ఆగస్టుకల్లా ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్గొండ, వెలుగు: ఎల్ నినో ఎఫెక్ట్‌‌‌‌ తో వర్షాలు పడేలా లేవని, పైనుంచి నీళ్లు వచ్చే గ్యారంటీ అంతకన్నా లేదని,  ఈ టైంలో వరి వేసి నష్టపోకుండా  ఆరుతడి పంటలు వేసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతులకు సూచించారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీలో ఉందని, శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినా అవి తాగడానికే సరిపోతాయని తెలిపారు. 

జూన్ 2027 వరకు తాగే నీటికే గ్యారంటీ లేని పరిస్థితి ఉందని,  సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల దక్షిణ తెలంగాణలో కరువు ముప్పు పొంచి ఉందని, ఇలాంటి కష్టకాలంలో రైతులు వరి వేస్తే నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు వేయించాలని ఆదేశించారు. జిల్లాలో పంట మార్పిడిలో భాగంగా ఇప్పటికే 33 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేశారని, దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని అధికారులు రైతలకు అవగాహన కల్పించాలన్నారు. 

నిరంతరం వరి సాగు చేయడం వల్ల భూములు సారం కోల్పోతాయని, భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లెంల ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ సెప్టెంబర్‌‌‌‌లోనూ వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతున్నందున, సాగునీటి లభ్యత చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందుకే ఆగస్టు 15 లోపే రైతులతో ఆరుతడి పంటలు వేయించేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.