హైదరాబాద్లో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో నగరమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సిటీలోని ప్రముఖ ఆలయాలు సహా కాలనీలు, బస్తీల్లోని గుడులన్నీ భక్తులతో సందడిగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దలిల్లుతున్నాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న టెంపుల్, మీరాలంమండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని పురాతన దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
లాల్ దర్వాజ బోనాలకు పోటెత్తిన భక్తులు
ఇవాళ పాతబస్తీలోని లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. డప్పు చప్పుళ్లు, ఆడపడుచుల సందడి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం పులకించిపోతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామున అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకం తర్వాత భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.
బోనాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. పాతబస్తీ, అంబర్ పేటలో వాహనాల రాకపోకలు మళ్లింపు..
లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం, సోమవారం పాతబస్తీలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. మదీనా ఎక్స్‌రోడ్స్ నుంచి ఇంజిన్‌బౌలి వరకు ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. దర్బార్ మైసమ్మ బోనాల సందర్భంగా కార్వాన్‌లో సోమవారం వరకు, అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద రెండు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు. పాతబస్తీ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. భక్తుల కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వాహనదారులు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అత్యవసర సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.
స్పెషల్ బస్సులు..
ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరిగే బోనాల జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంబర్‌పేట బోనాలకు వచ్చే భక్తుల కోసం రూట్ నంబర్లు 113ఎం, 113కె/ఎల్ బస్సులను అంబర్‌పేట ఫ్లైఓవర్ మీదుగా నడపనున్నట్లు తెలిపారు. రూట్ నంబర్ 107వీ బస్సులను జిందా తిలిస్మాత్, మూసారంబాగ్ మీదుగా, రూట్ నంబర్ 115 బస్సులను అంబర్‌పేట పోలీస్‌లైన్స్, రామంతాపూర్ మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
