బియ్యం మరాడించేందుకు సర్కార్ నుంచి వడ్లు తీసుకుని స్వాహా చేసిన రైస్ మిల్లర్లపై అధికారులు క్రిమినల్, ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టడం తప్పితే రికవరీ చేయలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 150 మిల్లర్లపై కేసులు నమోదు చేసినప్పటికీ ఒక్కరి ఆస్తిని కూడా జప్తు చేయలేదు.
కరీంనగర్ జిల్లాకు చెందిన బండారి మారుతి, ఆయన భార్య కలిసి జమ్మికుంట మండలం కోరపల్లిలోని ‘మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్’, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలోని ‘శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్’ను లీజుకు తీసుకున్నారు. ఈ మిల్లులకు 2022-23, 2023-24 వానాకాలం, యాసంగి సీజన్లలో అధికారులు వడ్లు కేటాయించారు. ఈ మొత్తం వడ్లలో గింజ కూడా ప్రభుత్వానికి తిరిగి రాలేదు. మహాశక్తి అగ్రో ఇండస్ట్రీస్ నుంచి రూ.49.83 కోట్లు, శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్ నుంచి రూ.54.18 కోట్ల విలువైన వడ్లు పక్కదారి పట్టాయి. మారుతి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోనూ రూ.24 కోట్లకుపైగా ధాన్యాన్ని ఇదే మాదిరిగా దారి మళ్లించాడు. దీంతో రామగుండం పోలీసులు ఇటీవల అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆయన మిల్లులన్నీ లీజుకు తీసుకున్నవే కావడం, వారి పేరిట ఆస్తులు లేకపోవడంతో రూ.104 కోట్లు ఎలా రికవరీ చేస్తారనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎస్వీ ఇండస్ట్రీస్ యజమాని సంకీస నాగరాజు 2014–15 ఖరీఫ్‌లో 3,317.42 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించారు. ఇందుకు సంబంధించి ఆయన రూ.61,59,439 చెల్లించాల్సి ఉంది. పదేళ్లు కావడంతో వడ్డీ, జరిమానాతో కలిపితే కోటిన్నర దాటే అవకాశముంది. పదేండ్ల తర్వాత అధికారులు సదరు మిల్లుపై ఎంక్వైరీ చేశారు. కానీ అప్పటికే నాగరాజు మృతిచెందగా, ఆ మిల్లును కూడా లోన్ బకాయి కింద బ్యాంకువాళ్లు వేలం వేసినట్లు గుర్తించారు. దీంతో రికవరీ చేయడానికి ఏమీ మిగల్లేదు.
- రెవెన్యూ శాఖకు కేసులు అప్పగించి చేతులు దులుపుకుంటున్న సివిల్ సప్లై అధికారులు
- రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క మిల్లునూ జప్తు చేయని ఆఫీసర్లు
కరీంనగర్/నెట్‌వర్క్, వెలుగు: బియ్యం మరాడించేందుకు సర్కార్ నుంచి వడ్లు తీసుకుని స్వాహా చేసిన రైస్ మిల్లర్లపై అధికారులు క్రిమినల్, ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టడం తప్పితే రికవరీ చేయలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 150 మిల్లర్లపై కేసులు నమోదు చేసినప్పటికీ ఒక్కరి ఆస్తిని కూడా జప్తు చేయలేదు. కేసులు నమోదు చేశాక డిమాండ్ నోటీసులు పంపి, నెల రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే వారి ఆస్తులు జప్తు చేయాల్సి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆఫీసర్ల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని వందల కోట్లు కొల్లగొట్టిన మిల్లర్లు.. కొద్ది రోజులు జైలుకు వెళ్లొచ్చి దర్జాగా తిరుగుతున్నారు. దీంతో ఏటా డీఫాల్టర్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఇంకా రూ.6,630.74 కోట్లు రావాలే..
బీఆర్ఎస్ హయాంలోనే మిల్లర్లు ఇష్టారాజ్యంగా ధాన్యం దారి మళ్లించారు. తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి 2025 వరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (మరాడించేందుకు) కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యంలో రూ.13,399.71 కోట్ల విలువైన 59.95 లక్షల టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో నుంచి ఇప్పటివరకు 31.73 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ.6,768.97 కోట్లు రికవరీ చేయగా, మరో 28.22 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.6,630.74 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇందులో 2022–23 రబీకి సంబంధించి 15.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ రికవరీ కాలేదు. దాని విలువే రూ.3,572 కోట్లు ఉంటుందని అంచనా.
సీఎంఆర్ కోసం వడ్లు కేటాయించిన మిల్లుల నుంచి పూర్తి స్థాయిలో బియ్యం తిరిగి వచ్చేలా చూడాల్సిన సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేసి గుర్తించే వరకు సివిల్ సప్లై ఆఫీసర్లు పత్తాలేరు. కొందరు ఆఫీసర్లు మిల్లర్లతో మిలాఖతై ఏండ్ల తరబడి ఆయా జిల్లాల్లో తిష్టవేసి ఉంటున్నారనే వాదనలున్నాయి. ఇలాంటి ఆఫీసర్ల అండతోనే మిల్లర్లు వందల కోట్ల విలువైన వడ్లను బియ్యంగా మార్చి రాష్ట్ర, దేశ సరిహద్దులకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాక రంగంలోకి దిగుతున్న తహసీల్దార్లు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ విషయంలో కేసులు నమోదు చేయించడంతో తమ పని అయిపోయినట్లు సివిల్ సప్లై అధికారులు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ సహకారంతో బకాయిదారుల ఆస్తులు జప్తు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
ఆస్తులే లేవు.. జప్తు ఎలా?
సీఎంఆర్ అనేది చాలా మంది మిల్లర్లకు పైసా పెట్టుబడి లేని వ్యాపారంగా మారింది. కొందరు ఇతరుల మిల్లులను లీజుకు తీసుకుని ప్రభుత్వం నుంచి వడ్లు కేటాయింపులు జరిగేలా చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మరాడించి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా బయటి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇలాంటి మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినా, సదరు మిల్లర్ మిల్లు కాకపోవడంతో జప్తు చేయడానికి ఆస్తులే ఉండడం లేదు. వ్యక్తులు తమ పేర్లపై ఎలాంటి ఆస్తులు లేకుండా బంధువులు, బినామీల పేరిట ఆస్తులు కూడబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాల వారీగా పరిస్థితి..
కరీంనగర్ జిల్లా: 38 రైస్ మిల్లుల నుంచి సుమారు రూ.180 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. వీటిలో ఐదు నెలల క్రితం వరకు 11 మిల్లులపై.. ఆ తర్వాత మరో 7 మిల్లులపై కలిపి 18 మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో మరో ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఇందులో హుజూరాబాద్‌కు చెందిన శ్రీసాయి ట్రేడర్స్ ఓనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో 2012 నుంచి డిఫాల్టర్లు ఉన్నప్పటికీ.. వారికి కేవలం నోటీసులు ఇవ్వడంతో సరిపెడుతున్నారు.
పెద్దపల్లి: కరీంనగర్‌కు మించి సీఎంఆర్ పెండింగ్ ఉంది. 2014–15 నుంచి 2023–24 వరకు సుమారు రూ.250 కోట్ల బకాయిలు ఉన్నాయి.
జగిత్యాల: జగిత్యాల మండలంలోని తక్కలపల్లి శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్‌లో తనిఖీల్లో సుమారు రూ.87 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు.
సూర్యాపేట: పదేండ్లలో13 మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. జూలై 20 నుంచి ఈ నెల 5 వరకు 10 మిల్లుల్లో అక్రమాలు జరిగితే 8 మిల్లులపై కేసులు నమోదయ్యాయి. మరో రెండు మిల్లులపై ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 23 కేసులు నమోదు చేశారు. ఆస్తులు జప్తు చేయలేదు.
నల్లగొండ: పదేండ్లలో 9 మిల్లులపై కేసులు నమోదయ్యాయి. ఎక్కడా మిల్లర్ల ఆస్తులను జప్తు చేయలేదు.
యాదాద్రి: మూడు రైస్ మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. ఆయా మిల్లులకు సంబంధించిన ఆస్తులను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టారు.
జోగులాంబ గద్వాల: మూడు రైస్ మిల్లులపై కేసులు నమోదవగా.. ఇప్పటివరకు ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ ప్రక్రియను ప్రారంభించలేదు.
నాగర్‌కర్నూల్: 8 రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 4 మిల్లులకు ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు.
వనపర్తి: 33 రైస్ మిల్లులకు ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు.
నారాయణపేట: 2019 నుంచి ఇప్పటివరకు 12 మంది రైస్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రూ.7.56 కోట్ల రైస్ మిల్లర్ల ఆస్తులు జప్తు చేశారు.
మెదక్: 14 మంది రైస్ మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మిల్లర్లకు నోటీసులు ఇవ్వగా రూ.28.62 కోట్లు చెల్లించారు.
సిద్దిపేట: ఆరు రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్ మండలం ఆరెపల్లిలోని ఏఆర్‌ఎం రైస్ మిల్లుకు సంబంధించి రూ.18 కోట్ల సీఎంఆర్ బకాయిల రికవరీకి పేపర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
సంగారెడ్డి: సీఎంఆర్ ఎగ్గొట్టిన నలుగురు రైస్ మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. ఆర్ఆర్ యాక్ట్ కింద మిల్లర్ల నుంచి రూ.9.28 కోట్లు రికవరీ చేశారు.
ఖమ్మం: మూడు రైస్ మిల్లులపై రికవరీ యాక్ట్ నోటీసులు ఇచ్చి జప్తునకు ప్రయత్నించారు. యజమానులు కోర్టుకు వెళ్లడంతో రికవరీ చేయలేదు.
మంచిర్యాల: 23 రైస్ మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. 19 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు ఫైల్ చేసి, నలుగురిని అరెస్టు చేశారు. రూ.288 కోట్ల డిఫాల్ట్ అమౌంట్‌లో కేవలం రూ.83 కోట్లు మాత్రమే రికవరీ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి: 2022 నుంచి రూ.12.76 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్న మొగుళ్లపల్లి మండలం అన్నపూర్ణ, కాటారం త్రీఆర్స్, రేగొండ దుర్గా భవాని రైస్ మిల్లులకు ఆర్ఆర్ యాక్ట్ నోటీసులు జారీ చేశారు. ఆస్తులు జప్తు చేయలేదు.
