- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- లక్ష్యం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ పోలీస్ సెమినార్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉన్నందున.. నేరం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందే అడ్డుకునే వ్యవస్థ ఉండాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా ఆధునిక పోలీసింగ్ విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం నేషనల్ పోలీస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు చైర్‌పర్సన్‌గా బండారు దత్తాత్రేయ వ్యవహరించారు. రాజస్తాన్ మాజీ డీజీపీ నరసింహరావు, మాజీ డీజీ గోపీనాథ్ సహా పలువురు మాజీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరిగిన కార్యక్రమంలో భవిష్యత్ పోలీసింగ్‌లో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై చర్చించారు.
సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి
సైబర్ నేరాలకు భౌగోళిక పరిమితులు లేవని దత్తాత్రేయ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, ఫిషింగ్, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ప్రత్యేక సైబర్ పరిజ్ఞానం అవసరమన్నారు. డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్, డిజిటల్ మోసాల వంటి కొత్త తరహా నేరాలపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ
అవసరమని పేర్కొన్నారు.
డ్రోన్లు, ఆర్థిక నేరాలపైనా చర్చ
భవిష్యత్ పోలీసింగ్‌లో సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కీలకంగా మారనున్నాయని సెమినార్‌లో అభిప్రాయపడ్డారు. డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్నాలజీల వినియోగంపైనా చర్చించారు. క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు కొత్త విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించారు
