ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని టెట్ నిబంధనల్లో తగిన సడలింపులు కల్పించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం బోధిస్తున్న సబ్జెక్టుల ఆధారంగా టెట్ ప్రశ్నపత్రాలను రూపొందించి పరీక్ష నిర్వహించాలని కోరారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్ నుంచి ప్రత్యేక మినహాయింపు కల్పించాలని అన్నారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు యు.పోచయ్య, ఎండీ.అమీర్ పాషా, బి.ఎన్.రెడ్డి, నందారం జైపాల్‌రెడ్డి, విజయభాస్కర్ పాల్గొన్నారు.
