Indian Players Injury: భారత జట్టుని ప్రస్తుతం గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఎంతలా అంటే, గాయపడిన ఆటగాళ్లతోనే ఏకంగా ఒక ప్లేయింగ్ ఎలెవెన్ తయారు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. గతంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలో ఫిట్‌నెస్ అనేది మొదటి ప్రాధాన్యతగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా తయారై జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బ తీస్తోంది.
బెంగళూరులో బీసీసీఐ అత్యవసర భేటీ:
గాయాల సంక్షోభం తీవ్రతరం కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈరోజు ( ఆదివారం, ఆగస్టు 9న) బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ని సందర్శించనున్నారు. అక్కడ ఆయన క్రికెట్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆటగాళ్ల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌పై సమీక్ష జరపనున్నారు. నేషనల్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. గాయాల నుంచి కోలుకునే సమయాలు, సెలెక్షన్ కమిటీ అంచనాల మధ్య సమన్వయం లోపించిందనే వార్తలతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
స్పోర్ట్స్ సైన్స్ టీమ్‌పై విపరీతమైన పనిభారం:
2025 ప్రారంభంలో స్పోర్ట్స్ సైన్స్ విభాగాధిపతి నితిన్ పటేల్ రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ సరైన హెడ్ లేకపోవడం, ప్రస్తుతం ఉన్న స్పెషలిస్టులపై విపరీతమైన పని భారం పడటం కూడా ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలకు ఒక కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రధాన సవాలు ఏంటంటే.. ప్లేయర్స్ ను వీలైనంత త్వరగా, పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ స్టేడియంలోకి తీసుకురావడమే.
