Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే.. ‘వారణాసి’ మైండ్ బ్లోయింగ్ అప్డేట్

Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే..  ‘వారణాసి’ మైండ్ బ్లోయింగ్ అప్డేట్

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ  ‘వారణాసి’ (VARANASI). దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై అతి భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవాళ ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారణాసి టీమ్ సినిమాకు సంబంధించిన రెండు కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది.

‘వారణాసి’ నుంచి కొత్త స్టిల్స్

ఈ కొత్త స్టిల్స్‌లో మహేష్ బాబు రుద్ర పాత్రలో రిలాక్స్‌డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను ‘వారణాసి’ ఆఫ్రికా షెడ్యూల్‌లో భాగంగా చిత్రీకరించారు. కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేశారు.

మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్ర గురించి ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. “రుద్ర తనకంటే ఎంతో పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చడానికి పుట్టాడు. తాను కోరుకోకపోయినా ఒక విధి అతని భుజాలపై పడుతుంది. అతను తెలివైనవాడు, సరదాగా ఉండే వ్యక్తి. అదే సమయంలో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటాడు. అవసరమైనప్పుడు ఎంతో భయంకరంగా మారగలడు. ఈ లక్షణాలన్నింటినీ మహేష్ తన పాత్రలో అద్భుతంగా తీసుకొచ్చాడు” అని అన్నారు.

రుద్ర ఎలా ఉంటాడో చెప్పిన రాజమౌళి..

“ఎవరైనా ఒక పాత్రను పవర్‌ఫుల్‌గా చేయగలరు. కానీ ఒకేసారి పవర్‌ఫుల్‌గా, సున్నితంగా కనిపించడం చాలా కొద్దిమందికే సాధ్యం. ఈ స్టిల్స్ మా ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవి. అక్కడి ప్రకృతి, భౌగోళిక అందాలు ఏ సెట్‌లోనూ సాధ్యం కాని అనుభూతిని మాకు ఇచ్చాయి. కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఉన్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని సందర్భాల్లో 1.43:1 IMAX ఫ్రేమ్ కూడా ఆ అందాన్ని పూర్తిగా చూపించలేదేమో అనిపించింది” అని రాజమౌళి పేర్కొన్నారు.

అలాగే ఎస్‌ఎస్ రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో మహేష్ బాబు కొత్త స్టిల్స్‌ను షేర్ చేస్తూ.. “పవర్‌ఫుల్‌గా ఉండటమే అతని ఏకైక కోణం కాదు.. #Varanasiలో రుద్ర” అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు ‘వారణాసి’ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ కూడా.. “మరోసారి సూర్యుడి చుట్టూ ఒక ప్రయాణం పూర్తయింది.. మనం కాలం అంతటా ప్రయాణించే ముందు. హ్యాపీ బర్త్‌డే రుద్ర” అంటూ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న..

ఈ చిత్రం సుమారు రూ.1,300–1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా, 1.43:1 IMAX ఫార్మాట్‌లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి నాన్-ఇంగ్లీష్ సినిమాగా కూడా ఈ ప్రాజెక్ట్ నిలవనున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.