- అమెరికాలో ఎన్నారైలతో డిప్యూటీ సీఎం భట్టి
- హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ కార్ల వినియోగంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఎన్నారైలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల విస్తరణలో భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్‌లెస్ వాహనంలో ప్రయాణించిన భట్టి.. వేమో ప్రతినిధులతో సమావేశమయ్యారు. డ్రైవర్‌లెస్ వాహనాల సాంకేతికత, నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నియంత్రణ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు.
హైదరాబాద్‌తోపాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై చర్చించారు. అధిక రిజల్యూషన్ మ్యాపింగ్, సెన్సార్ అనుకూల రోడ్డు డిజైన్, ప్రత్యేక టెస్టింగ్ కారిడార్లు, డేటా కనెక్టివిటీ, ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల అవసరాలపై వేమో ప్రతినిధులతో చర్చించారు. భవిష్యత్‌లో డ్రైవర్‌లెస్ వాహనాల విస్తరణకు అవసరమైన నియంత్రణ, విధానపరమైన అంశాలపైనా ఆరా తీశారు. నూతన తరం మొబిలిటీ టెక్నాలజీని హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికల్లో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు భట్టి సూచించారు.
