బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని గ్రంథాలయాల సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ అధ్యక్షతన ‘గ్రంథాలయాల ప్రస్తుత స్థితి, సవాళ్లు - భవిష్యత్ దిశానిర్దేశం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం సేకరిస్తున్న సెస్ నిధులను స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలు తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ నిధులను ఇతర పనులకు మళ్లించకుండా, కేవలం గ్రంథాలయాల అభివృద్ధి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి కొత్త సిబ్బందిని నియమించడంతో పాటు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను త్వరగా చెల్లించాలని సూచించారు.అనంతరం కొక్కుల దేవేందర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నులో 8 శాతం మొత్తాన్ని లైబ్రరీ సెస్ కింద జిల్లా గ్రంథాలయ సంస్థలకు ఎప్పటికప్పుడు జమ చేయాలని వెల్లడించారు.
ఔట్‌సోర్సింగ్‌కు స్పష్టమైన విధానం ప్రకటించాలి
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం జేఏసీ కమిటీ మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో పరిపాలనలో తాము కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, సరైన ఉద్యోగ భద్రత లేకుండా, తక్కువ వేతనాలతో ఏజెన్సీల దోపిడీకి గురికావాల్సి వస్తోందని జేఏసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఒక్కోక్కటిగా పరిష్కరిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఒకటో తేదీనే జీతాలు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు విషయంలోనూ అదే విధంగా ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు.
