హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కేది మూడో స్థానమేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌తో తెలంగాణకు ఏమాత్రం సారూప్యం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చామని, తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
రాష్ట్రంలో జెన్ జీతోపాటు అన్ని వర్గాల ఆదరణ సీఎం రేవంత్‌రెడ్డికి ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారని, ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కోరుకుంటారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా అధికారంలోకి వచ్చిందని మల్లు రవి ఆరోపించారు.
