మహిళలు శక్తిమంతులుగా ఎదగాలి: మంత్రి సీతక్క

మహిళలు శక్తిమంతులుగా ఎదగాలి: మంత్రి సీతక్క

న్యూఢిల్లీ, వెలుగు: డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని అన్ని రంగాల్లోనూ శక్తిమంతులుగా ఎదగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తోందని, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నారీ శక్తి అభియాన్ శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా సమాజంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుకునేలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. డిజిటల్ యుగంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.