హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో HMDA క్రేజ్ మరోసారి నిరూపితమైంది.మేడిపల్లి లేఅవుట్ ఈ-ఆక్షన్‌కు బిడ్డర్ల నుంచి భారీ స్పందన లభించింది.హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్‌లో మొత్తం 68 రెసిడెన్షియల్ ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించగా... హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పోటెత్తారు.
ఈ వేలంలో మొత్తం 68 ప్లాట్లకు గానూ.. ఏకంగా 63 ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధికంగా గజం ధర రూ. 80 వేలు పలకడం విశేషం. ఇక సగటున గజానికి ధర రూ. 56,260 నమోదైంది.
మేడిపల్లి లేఅవుట్ ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏకు సుమారు రూ.120 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. రియల్ రంగంలో మందగమనం అన్న మాటకే తావు లేకుండా... హైదరాబాద్ శివార్లలో భూములకు ఉన్న క్రేజ్‌ను ఈ వేలం మరోసారి స్పష్టం చేసింది. ప్లాన్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఉన్న డిమాండ్‌తో పాటు, HMDA లేఅవుట్లపై ప్రజలకున్న నమ్మకానికి ఈ స్పందనే నిదర్శనమని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
