మొహర్రం సెలవు జూన్ 25నా.. 26నా? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు పూర్తి వివరాలు ఇదిగో !

 మొహర్రం సెలవు జూన్ 25నా.. 26నా? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు పూర్తి వివరాలు ఇదిగో !

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది (హిజ్రీ 1448) మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో జూన్ 17న నెలవంక కనిపించడంతో ఈ పవిత్ర మాసం మొదలైంది. గల్ఫ్ దేశాలలో మనకంటే ఒక రోజు ముందే (జూన్ 16న) మొహర్రం ప్రారంభమైంది.

మొహర్రం నెలలో అన్నింటికంటే ముఖ్యమైన రోజు మొహర్రం పదో రోజు. చంద్రుడి దర్శనంలో తేడా ఉండటం వల్ల సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలలో మొహర్రం జూన్ 25 (గురువారం) నాడు పాటిస్తుండగా, భారతదేశంలో జూన్ 26 (శుక్రవారం) నాడు జరుపుకుంటారు.

జూన్ 26న ప్రభుత్వ సెలవు ఉందా ?
అవును, ఉంది. మొహర్రం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 26వ తేదీని గెజిటెడ్ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు మూసి ఉంటాయి. స్టాక్ మార్కెట్లు కూడా పనిచేయవు.

లాంగ్ వీకెండ్
 మొహర్రం  సెలవు శుక్రవారం రావడం వల్ల ఉద్యోగులకు, విద్యార్థులకు వరుసగా మూడు రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాలు లాంగ్ వీకెండ్ హాలిడేస్ లభిస్తాయి.

గమనిక: గోవా, గుజరాత్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు అధికారిక సెలవుల లిస్టులో మొహర్రంకు సెలవు ఇవ్వవు.

మొహర్రం ఎందుకు అంత ముఖ్యం?
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నాలుగు నెలల్లో మొహర్రం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇది చాలా ముఖ్యమైనది.

సున్నీ ముస్లింలు: పూర్వం 'ఫరో' అనే రాజు అరాచకాల నుండి ప్రవక్త మూసా (మోసెస్)ను, ఆయన అనుచరులను దేవుడు కాపాడిన రోజుగా 'మొహర్రం'ను భావిస్తారు. ఈ రోజున ప్రవక్త ముహమ్మద్ ఉపవాసం ఉండేవారు.

►ALSO READ | నెలకు లక్ష సంపాదిస్తున్నా రూపాయి కూడా దాయలేకపోతున్న ఇండియన్స్.. డబ్బంతా ఎక్కడికి పోతోంది..?

షియా ముస్లింలు: క్రీ.శ. 680లో జరిగిన కర్బలా యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన ప్రవక్త ముహమ్మద్ మనవడు 'ఇమామ్ హుస్సేన్' త్యాగాన్ని ఈ రోజున స్మరించుకుంటారు.

మొహర్రం రోజున ఏం చేస్తారు?
సున్నీ ముస్లింలు: మొహర్రం నెలలోని 9, 10వ రోజుల్లో ఉపవాసాలు ఉంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, పేదలకు దానధర్మాలు అందిస్తారు.

షియా ముస్లింలు: మొహర్రం మొదటి పది రోజులను శోకదినాలుగా పాటిస్తారు. ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ నల్లటి బట్టలు ధరించి, విచారంతో ఊరేగింపులు (పీర్ల పండుగ) నిర్వహిస్తారు.