ఒకప్పుడు నెలకి రూ.లక్ష సంపాదిస్తే చాలు.. లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనని అనుకునేవాళ్లం. సమాజంలో ఆరెంకెల జీతం అంటే అదో పెద్ద హోదా. జీవితానికి ఇక తిరుగులేదనే ధీమా ఉండేది. కానీ ఈరోజుల్లో మెట్రో సిటీల్లో ఉద్యోగం చేస్తూ.. చేతి నిండా లక్షకు పైగా జీతం తీసుకుంటున్నా, నెల ఆఖరికి వచ్చేసరికి అకౌంట్ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. "జీతం బాగానే వస్తోంది, కానీ ఆ డబ్బంతా ఎటు పోతోంది?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కాగితాల మీద ఈ జీతం చాలా లగ్జరీగా కనిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం చాలామంది యువ ప్రొఫెషనల్స్ బ్యాంక్ బ్యాలెన్స్ నెల చివరికి వచ్చేసరికి ఖాళీగా కనిపిస్తోంది ఈ రోజుల్లో.
లైఫ్‌స్టైల్ క్రీప్.. తెలీకుండానే జేబుకు చిల్లు
సాలరీ పెరిగిన ప్రతిసారీ మనకు తెలియకుండానే మన లైఫ్ స్టైల్ కూడా సైలెంట్‌గా అప్‌గ్రేడ్ అయిపోతుంది. దీనినే 'లైఫ్‌స్టైల్ క్రీప్' అంటారు. నిన్నటి వరకు నార్మల్ ఫోన్ వాడిన చేతులు, లక్ష జీతం రాగానే ఐఫోన్ కోసం ఆరాటపడతాయి. చిన్న ఇల్లు కాస్తా పెద్ద ఫ్లాట్‌గా మారుతుంది. వారాంతపు నార్మల్ అవుటింగ్స్ కాస్తా.. కాస్ట్లీ పబ్‌లు, లగ్జరీ ట్రిప్పులుగా మారిపోతాయి. కష్టపడి సంపాదించినప్పుడు ఎంజాయ్ చేయడం తప్పు కాదు. ఆదాయంతో పాటే ఖర్చులు కూడా అంతే వేగంగా పెరిగినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఒకప్పుడు లగ్జరీగా అనిపించిన విషయాలు, క్రమంగా అలవాటుగా మారిపోయి ప్రతి నెలా తెలియకుండానే భారీగా మారిపోతుంటాయి.
తర్వాత ఇన్వెస్ట్ చేద్దాంలే..
చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రాధాన్యత తెలుసు. అయినా ఈ నెల ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వచ్చే నెల చూద్దాంలే అంటూ వాయిదా వేస్తుంటారు సేవింగ్స్. ఈ నెలలో వెకేషన్, వచ్చే నెలలో బంధువుల పెళ్లి, ఆ తర్వాత కొత్త గ్యాడ్జెట్.. ఇలా ఏదో ఒక సాకుతో ఇన్వెస్ట్‌మెంట్‌ను పోస్ట్‌పోన్ నిరంతరం కొనసాగుతుంది. నిజానికి సంపద అనేది ఎప్పుడో ఒకసారి పెట్టే పెద్ద పెట్టుబడుల వల్ల రాదు.. ప్రతి నెలా క్రమం తప్పకుండా చేసే చిన్న ఇన్వెస్ట్‌మెంట్ వల్లే వస్తుంది. ఆదాయం తక్కువ ఉన్నా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే వ్యక్తి, భారీగా సంపాదిస్తూ పెట్టుబడులను వాయిదా వేసే వ్యక్తి కంటే భవిష్యత్తులో ఎక్కువ సంపదను సృష్టించగలడు.
►ALSO READ | రోజురోజుకూ దిగొస్తున్న బంగారం రేట్లు.. బుధవారం హైదరాబాద్ ధరలు ఇవే..
మెట్రో సిటీల మాయాజాలం..
బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బతకడం ఈ రోజుల్లో చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. చేతికి లక్ష రూపాయలు రాకముందే ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, కార్ ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంల రూపంలో సగానికి పైగా సొమ్ము ఆవిరైపోతుంది. దీనికి తోడు క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ ఆప్షన్లు మనకు లేని కొనుగోలు శక్తిని ఉన్నట్లు భ్రమింపజేస్తాయి. అప్పు చేసే సామర్థ్యాన్ని ఆర్థిక బలంగా భ్రమపడి.. అనవసరమైన లగ్జరీ వస్తువులను కొనేస్తూ చాలామంది చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బయటకు రిచ్‌గా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఈఎంఐల భారం వారిని కుంగదీస్తోంది.
సంపాదన వేరు.. సంపద సృష్టించడం వేరు
చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. వచ్చిన జీతంలో నుంచి ఖర్చులు పోగా మిగిలిన దాన్ని దాచుకుందాం అనుకోవడం. కానీ నిజమైన ఫైనాన్షియల్ సక్సెస్ కావాలంటే జీతం రాగానే ముందుగా సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టేసి, ఆ తర్వాత మిగిలిన దాంతోనే నెలకు సరిపెట్టుకోవాలి. అలాగే లగ్జరీ కార్లు, ఖరీదైన గ్యాడ్జెట్లను ఇన్వెస్ట్‌మెంట్‌లుగా భావించడం అపోహ మాత్రమేనని గ్రహించాలి. అవన్నీ కాలక్రమేణా వాల్యూ తగ్గిపోయే ఆస్తులు. నెల నెలా లక్ష రూపాయలు సంపాదించడం గొప్ప విషయమే కావచ్చు. ఆ సంపాదన మిమ్మల్ని ధనవంతులుగా మార్చదు. మీ దగ్గర ఎంత డబ్బు మిగిలింది.. అది మీ భవిష్యత్తు కోసం ఎలా పని చేస్తోంది అనేదే మిమ్మల్ని నిజమైన ఐశ్వర్యవంతులుగా చేస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
