- తల్లిదండ్రులు లేకున్నా నో ప్రాబ్లమ్.. ఆరుగురు బంధువులతో మ్యాపింగ్
- వీ6 వెలుగు ఇంటర్వ్యూలో సీఈవో సుదర్శన్‌రెడ్డి
- ఫారంలో వివరాలు కచ్చితంగా నింపాల్సిందే
- విదేశాల్లో చదువుతున్నా.. దవాఖానాలో చికిత్స
- పొందుతున్నా కుటుంబ సభ్యుల ధ్రువీకరణతో ఓటు పదిలం
- ముసాయిదాలో పేరు లేకపోయినా.. అభ్యంతరాల్లో మళ్లీ చెప్పొచ్చు
- అర్హులను తీసేస్తే జైలుకే.. అక్రమాలకు తావులేదు
- ఆన్‌లైన్‌లోనూ ‘సర్’ సేవలు ఉంటాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇంటికి తాళం ఉన్నా.. ఎవరూ అందుబాటులో లేకపోయినా బూత్ లెవెల్ అధికారులు వదిలిపెట్టరని, ప్రతి ఇంటికి ఒకసారి కాదు.. 3 సార్లు కచ్చితంగా వస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టంచేశారు. నకిలీ ఓట్లకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా సాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో 2002 నాటి ఓటర్ల జాబితాతో మిగిలిపోయిన సుమారు 1.2 కోట్ల మంది వివరాలను పకడ్బందీగా మ్యాపింగ్ చేయడంతోపాటు పాత, గుర్తుపట్టలేని ఫొటోల స్థానంలో లేటెస్ట్ ఫొటోలను సేకరిస్తామని తెలిపారు.
‘సర్’లో భాగంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వేపై‘వీ6వెలుగు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుదర్శన్‌రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, దవాఖానాల్లో చికిత్స పొందుతున్న రోగుల ఓట్లను తొలగించకుండా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ ద్వారా కాపాడుతూనే, గంపగుత్తగా వచ్చే తప్పుడు దరఖాస్తులపై, తప్పులు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఒకవేళ బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేనివారు voters.eci.gov.in ద్వారా సొంతంగా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించవచ్చని, అలాగే పాత రికార్డులను సరిచూసుకోవడానికి 2002 నాటి జాబితాను ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని సీఈవో తెలిపారు. బీఎల్ఓలు తీసుకొచ్చే ఎన్యుమరేషన్ ఫారాలు రెండు సెట్లు ఉంటాయని, ఒక ప్రతిని ఓటరుకు ఇచ్చి, మరొకటి అధికారులు ఉంచుకుంటారని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
రెండింటిలోనూ ఒకే రకమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుందన్నారు. ఫారాలు నింపే క్రమంలో ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి ప్రతి 10 మంది బీఎల్ఓలకు ఒక సూపర్‌వైజర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. అంతేకాకుండా, ఓటర్లు ‘1950’ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
దవాఖానలో ఉన్నవారు ఏంచేయాలి?
అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా దవాఖానలో లేదంటే చికిత్స కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ‘శాశ్వతంగా వలస వెళ్లినట్లు’ భావించం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వీరు ‘మినహాయింపు విభాగం’ కిందికి వస్తారు. బీఎల్ఓ ఇంటింటి తనిఖీకి వచ్చినప్పుడు సదరు ఓటరు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేయవచ్చు. ఓటరు సంతకం లేదా వేలిముద్రతో కూడిన అధికారిక లేఖ, సంబంధిత రుజువులను బీఎల్ఓకు అందజేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకపోతే, పొరుగువారి ద్వారా విచారించి ‘తాత్కాలికంగా లేరు’ అని బీఎల్ఓ నమోదు చేస్తారు తప్ప, వెంటనే పేరు తొలగించరు.
ఒకే ఒక్క తనిఖీతో మీ ఓటును తొలగించరు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉన్నా, అందుబాటులో లేకపోయినా.. బీఎల్ఓలు కనీసం3 సార్లు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత కూడా మీరు అందుబాటులో లేకపోతే పొరుగువారి ద్వారా వివరాలు సేకరిస్తారు తప్ప, ఓటరుకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఓటును తొలగించరు.
విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో తాత్కాలికంగా చదువుకునే విద్యార్థులు కూడా మినహాయింపు విభాగం కిందికే వస్తారు. వారి తరఫున కుటుంబ సభ్యులు ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్యూమరేషన్ ఫారం) సమర్పించవచ్చు. దీని కోసం సదరు ఓటరు సంతకం చేసిన అధికారిక లేఖను, కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాన్ని తెలిపే రుజువును జత చేయాలి. అలాగే, ఎన్నికల సంఘం అందిస్తున్న ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి నివాస వివరాలను ధ్రువీకరించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చా?
అవును, నిశ్చయంగా చేసుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. ఓటర్లు అధికారిక వెబ్‌సైట్ voters.eci.gov.in లేదా ఓటర్ పోర్టల్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆన్‌లైన్‌లోనే వివరాలు నింపి సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన వివరాలను కూడా బీఎల్ఓలు తదుపరి ఇంటింటి సర్వేలో వచ్చి ధ్రువీకరిస్తారు.
ఫేక్ ఓట్లు చేర్చాలనే ఉద్దేశంతో దరఖాస్తులు నింపి, గుంపగుత్తగా సిబ్బంది చేతిలో పెడితే?
‘సర్’ మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి పద్ధతులను ఏమాత్రం అనుమతించబోం. ప్రతి ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్ఓలు స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు సమక్షంలోనే సేకరించాల్సి ఉంటుంది. గుంపగుత్తగా దరఖాస్తులను సమర్పించడాన్ని ఎన్నికల సంఘం అనుమతించదు.
ఒకవేళ కాలనీ ప్రతినిధుల పేరుతో దరఖాస్తులు వచ్చినా, బీఎల్ఓలు స్వయంగా ఆయా ఇండ్లకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. తప్పుడు వివరాలు లేదా తప్పుడు డిక్లరేషన్ సమర్పించడం ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 కింద శిక్షార్హమైన నేరం.
అర్హులైన ఓటర్లను సిబ్బంది కావాలని తీసేస్తే ?
ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని, అక్రమాలను ఏమా త్రం సహించబోం. నిబంధనలను ఉల్లంఘించి ఫేక్ ఓట్ల నమోదుకు సహకరించే లేదా అర్హులైన ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే సిబ్బందిపై శాఖాపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటాం.
ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఉన్నతాధికారులు (ఈఆర్వోలు, డీఈవోలు) నిరంతరం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఒక ఓటును తొలగించాలంటే లిఖితపూర్వకంగా సరైన కారణంతో తొలగించాల్సి ఉంటుంది. ‘సర్’కు 2002 ఓటర్ లిస్ట్‌ను బేస్‌గా తీసుకుంటున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన వారి ఎన్యూమరేషన్ ఎలా చేస్తారు?
తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ ఓటరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘మ్యాపింగ్, లింకింగ్’ నియమాల ప్రకారం తల్లిదండ్రులే కాకుండా, ఇతర రక్తసంబంధీకుల (తాత, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలాంటి ఆరుగురు బంధువుల) వివరాలతో కూడా 2002 లిస్ట్‌తో మ్యాపింగ్ చేసుకోవచ్చు.
ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే, ధ్రువీకరణ సమయంలో వారికి నోటీసు అందుతుంది. అప్పుడు వారు తమ పుట్టిన తేదీ ఆధారంగా ఎన్నికల సంఘం సూచించిన ప్రత్యామ్నాయ పత్రాలను (ఆధార్, పాస్‌పోర్ట్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేదా తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు) సమర్పించి ఓటు హక్కును సులభంగా కాపాడుకోవచ్చు.
బీఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలపై ఓటర్ల ఫొటోలు తప్పనిసరిగా అతికించాలా?
ఓటర్ల వివరాలను సరిగ్గా నమోదు చేసేందుకు ఓటర్లు తమ సంతకం, లేటెస్ట్ ఫొటోను సమర్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం దిగిన ఫొటోలు ఉండి, ప్రస్తుతం ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నవారు, అలాగే ఫొటోలు సరిగ్గా లేని వారు కచ్చితంగా అందజేయాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు. ఎన్యూమరేషన్ ఫారంలో ఫొటో కాలమ్‌ను అప్‌డేట్ చేయడం ఓటర్ జాబితా నాణ్యతను పెంచేందుకు దోహదపడుతుంది.
2002 జాబితాలు అందుబాటులో ఉంటాయా?
అవును..ఉన్నాయి. పారదర్శకత కోసం 2002 నాటి పూర్తి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ఓటర్ల జాబితా డేటాను అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in లో అందుబాటులో ఉంచాం. అక్కడ ఓటర్లు తమ పేరు, పాత ఎపిక్ నంబర్ లేదా ఇతర వివరాల ఆధారంగా సులభంగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిజికల్‌గా పాత ఓటర్ కార్డు లేకపోయినా, ఆన్‌లైన్ డేటాబేస్ ద్వారా మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరును కనుగొని లింక్ చేసుకోవచ్చు.
2002లో ఒక చోట ఉండి, ప్రస్తుతం వేరే ప్రాంతంలో స్థిరపడి అక్కడ ఓటు కలిగి ఉంటే.. వారు ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్‌తోనే మ్యాపింగ్ జరగాలి. రెండు చోట్లా ఓటు ఉండటం చట్టరీత్యా నేరం కనుక, వారు పాత చోట ఉన్న ఓటును తొలగించుకునేందుకు లేదా కొత్త అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గతంలో అద్దెకున్నవారు ఖాళీ చేసి వెళ్లినా ఓట్లు అలాగే ఉంటే ?
ఇది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. బీఎల్ఓ మీ ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు.. ఆయా వ్యక్తులు ప్రస్తుతం అక్కడ నివసించడం లేదని (శాశ్వతంగా వలస వెళ్లినట్టు) బీఎల్ఓకు స్పష్టంగా తెలియజేయవచ్చు. బీఎల్ఓ క్షేత్రస్థాయి విచారణ జరిపి సదరు ఓటర్ల పేర్ల పక్కన 'షిఫ్టెడ్' అని రాసుకుంటారు. అనంతరం వారికి నోటీసు జారీ చేసి, వారు స్పందించకపోతే ఆ ఓట్లను మీ అడ్రస్ నుంచి తొలగిస్తారు.
‘మ్యాపింగ్’ అంటే ఏమిటి? ప్రతి ఓటరు దీనిని కచ్చితంగా చేసుకోవాలా?
ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఓటరు వివరాలను, గతంలో (2002 లో) జరిగిన చివరి ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) డేటాబేస్‌తో పోల్చి సరిచూసే ప్రక్రియనే ‘మ్యాపింగ్’ అంటారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 3.39 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 2.18 కోట్ల మంది (సుమారు 64 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. మిగిలిన 1.2 కోట్ల మంది (36 శాతం) ఓటర్లు ఇంకా మ్యాప్ కాలేదు.
బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారంలో తమ పాత ఓటు వివరాలను లేదా తమ కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ) పాత వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ మ్యాపింగ్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు. నోటీసు అందిన ఓటరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో (ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) ఏదైనా ఒక దానిని బీఎల్ఓ లేదా ఈఆర్వోకు చూపిస్తే వారి ఓటు హక్కు సురక్షితంగా ఉంటుంది.
అధికారులను అడ్డుకుంటే ఎలా వ్యవహరిస్తారు?
ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రక్రియ. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం లేదా అడ్డుకోవడం చట్టరీత్యా నేరం. ఎక్కడై నా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, మొదట స్థానిక పెద్దలు, సామాజిక ప్రతినిధుల ద్వారా అవగాహన కల్పిస్తాం. అయినా అడ్డుకుంటే, జిల్లా యంత్రాంగం పోలీసు భద్రతతో తనిఖీ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించే వారిపై ప్రాతినిధ్య చట్టం ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి.
గడువులోగా వివరాలు అప్‌డేట్ చేసుకోనివారి పరిస్థితి ఏంటి?
ఈ నెల 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే గడువు ముగిసేసరికి అనివార్య కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేర్లు జులై 31న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఉండకపోవచ్చు. అలాగని వారి ఓటు హక్కు పూర్తిగా పోయినట్లు కాదు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేయడానికి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు సమయం ఉంటుంది. ఆ టైంలో ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా ఈఆర్వో కార్యాలయంలో ఫారం-6 లేదా ఫారం-8 సమర్పించి తమ ఓటు హక్కును తిరిగి నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణకు ముందే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
