- జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, వెలుగు: ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని, ఇందుకోసం 10వ షెడ్యూల్‌ను సవరించాలని బీజీపీ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభ సభ్యుల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లను స్పీకర్లు త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. మంగళవారం సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రాసిన ‘వెంకయ్య నాయకుడు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు’ అనే బయోగ్రఫీ బుక్‌ను మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
రాజకీయాల్లో ఉండేవారు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. బడ్జెట్ వనరులను ప్రకటించాకే ఉచిత పథకాలపై హామీలు ఇవ్వాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేదని, ఉద్యోగుల శాలరీలు, పెన్షన్ల కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. కేవలం పేదలకు మాత్రమే విద్య, వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. తన పొలిటికల్ జర్నీని గుర్తుచేసుకుంటూ.. వాజ్‌పేయి, అద్వానీల సపోర్ట్‌తోనే తాను ఈ పొజిషన్‌కు చేరానని ఎమోషనల్ అయ్యారు.
యువత ఇష్టపడి కష్టపడితే సక్సెస్ అవుతారన్నారు. దేశ సేవలో ఫ్యామిలీకి న్యాయం చేయలేకపోయినా, భార్య ఉషమ్మ, పిల్లలు సపోర్ట్ చేశారన్నారు. గతంలో మోదీని సీఎం పదవి నుంచి తప్పించవద్దని వాజ్‌పేయిని ఒప్పించడం, 2014లో మోదీని పీఎం అభ్యర్థిగా ప్రతిపాదించడం తన కెరీర్‌లో కఠినమైన నిర్ణయాలని గుర్తుచేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, హరిబాబు, ఏపీ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్, బండారు దత్తాత్రేయ, జీఎంఆర్ గ్రూప్ అధినేత మల్లికార్జునరావు, పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
