- 176 మంది డాక్టర్లతో సెకండ్ లైన్ ట్రీట్మెంట్
- హైదరాబాద్ చుట్టుపక్కల 4 జిల్లాల్లో 24 క్లస్టర్లుగా విభజన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేసేందుకు వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో పెరుగుతున్న జనాభా, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్ అర్బన్ పరిధిలోని 145 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్పెషలిస్ట్ పాలీక్లినిక్‌లుగా అప్ గ్రేడ్ చేయనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 38.88 శాతం జనాభా నగరాల్లోనే నివసిస్తుండటం, మురికివాడల్లో అంటువ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టింది.
దీనివల్ల సాధారణ జ్వరం, జలుబుకే పరిమితం కాకుండా ఇకపై గుండె, ఎముకలు, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి 8 రకాల ప్రత్యేక విభాగాల డాక్టర్లు నేరుగా బస్తీల్లోనే అందుబాటులో ఉండనున్నారు. ఈ మెగా ప్రాజెక్టును మొదటి విడతగా హైదరాబాద్ మహానగర పరిధిలోని నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 91, మేడ్చల్ 28, రంగారెడ్డి 25, సంగారెడ్డిలో ఒక కేంద్రాన్ని ఎంపిక చేసి, మొత్తం145 సెంటర్లను 24 క్లస్టర్లుగా విభజించారు.
ప్రతి క్లస్టర్‌కు 6 యూపీహెచ్ సీలను అనుసంధానిస్తూ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ సేవల కోసం ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 176 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను, సీనియర్ రెసిడెంట్లను కేటాయించారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, పల్మనరీ, ఆర్థోపెడిక్స్ విభాగాల డాక్టర్లు వారానికోసారి, ఈఎన్‌టీ, కంటి వైద్య నిపుణులు పదిహేను రోజులకు ఒకసారి ఆయా కేంద్రాల్లో రోగులకు అందుబాటులో ఉంటారు.
పెద్దాసుపత్రులపై తగ్గనున్న లోడ్...
ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పాలిక్లినిక్ లలో నిపుణుల ఓపీ సేవలు కొనసాగుతాయి. సీనియర్ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో సాగే ఈ విధానం వల్ల సామాన్యులకు ఇంటికి దగ్గరే నాణ్యమైన వైద్యం అందడమే కాకుండా.. గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాసుపత్రులపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. అనవసరమైన రెఫరల్స్ తగ్గి, కేవలం అత్యవసర కేసులకే ఆసుపత్రులు పరిమితమయ్యేలా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు.
