891 మంది తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం : లేఖ రాసిన ఏపీ సీఎస్

891 మంది తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం : లేఖ రాసిన ఏపీ సీఎస్
  • చేర్చుకోవద్దని ఉద్యోగ సంఘాల డిమాండ్
  • ఆర్థిక భారంతో పాటు ప్రమోషన్లు దెబ్బతింటాయని ఆవేదన
  • ముందు ఇక్కడున్న ఏపీ ఉద్యోగులను పంపాలని విజ్ఞప్తి
  • తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై నెలకొన్న ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఉద్యోగుల విభజన ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణరావుకు ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ ఇటీవల లేఖ రాశారు. ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయం, అంగీకారాన్ని తెలియజేయాలని కోరారు.  రాష్ట్ర విభజన జరిగి 12 ఏండ్లు గడిచినా ఉద్యోగుల సర్దుబాటు పూర్తికాలేదు.

ప్రస్తుతం తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు 1,943 మంది ఉన్నారు. 2014 నుంచి ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు పలుమార్లు చర్చలు జరిపాయి. కాలక్రమేణా కొందరు ఉద్యోగులు రిటైర్ కావడం, మరికొందరు మరణించడం, ఇంకొందరు తెలంగాణకు రావడానికి ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో సంఖ్య తగ్గింది.  తాజాగా ఏపీ ప్రభుత్వం పంపిన లేఖలో 891 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొంది. స్థానికత ఆధారంగా వారిని తెలంగాణకు రిలీవ్ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. 

తెలంగాణ ఉద్యోగ సంఘాల అభ్యంతరం

 అయితే, ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్యూమరీ పోస్టులు సృష్టించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొంటున్నాయి. అలాగే, తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉద్యోగులను ముందుగా ఏపీకి పంపాలని డిమాండ్ చేస్తున్నాయి.

కొత్తగా వచ్చే ఉద్యోగుల వల్ల స్థానిక ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పంపిన లేఖ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఒకవైపు తెలంగాణ స్థానికత ఉద్యోగులను పంపేందుకు ఏపీ సిద్ధంగా ఉండగా, మరోవైపు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.  

వాళ్లను చేర్చుకోవద్దని ప్రభుత్వాన్ని కోరతాం

ఏపీలో ఉన్న తెలంగాణ స్థానికత ఉద్యోగుల రిలీవ్ అంశంపై ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం అడిగింది. 891 మందిని  చేర్చుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ అంశంపై  గత ఏడాది ఏపీకి తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వాళ్లను చేర్చుకోమని సీఎం మాకు చెప్పారు. తెలంగాణలో ఏపీ స్థానికత ఉన్న వాళ్లు సుమారు 1400 మంది ఉన్నారు. వారిని ఏపీకి పంపించేందుకు ఆప్షన్లు తీసుకోవాలి.  ఇక్కడి నుంచి వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చే వాళ్లు సేమ్ క్యాడర్ ఉంటేనే ఒప్పుకుంటాం. తెలంగాణ ఉద్యోగులకు నష్టం జరగనివ్వం. - ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో ప్రెసిడెంట్  ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు వస్తమంటున్నరు రాష్ర్ట విభజన సమయంలో కమల్ నాథన్ కమిటీ సూచన మేరకు మాది తెలంగాణ అయినా ఏపీకి కేటాయించారు.

2014 నుంచి ఇదే అంశంపై  మా యూనియన్ టీఎన్ఈడబ్ల్యూ ఎస్ఏ( తెలంగాణ నేటివ్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర ) నుంచి  పోరాడుతున్నం. డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్‌‌‌‌లు, తెలంగాణ ఉద్యోగ సంఘాలకు వినతిపత్రాలు ఇచ్చాం. గత 10 ఏండ్లు పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక ఈ అంశంపై ముందడుగు పడింది. మొత్తం 1800 మంది తెలంగాణకు వెళతామని ఏపీ ప్రభుత్వానికి ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఏపీకి చెంది హైదరాబాద్‌‌‌‌లో ఇళ్లు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. వారిని చేర్చుకోద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ప్రమోషన్ కు దగ్గర ఉన్నవాళ్లు తెలంగాణకు వచ్చేందుకు వెనుకాడుతున్నారు. నిజమైన స్ధానికత ఉన్న వాళ్లను త్వరగా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - అంజయ్య,  తెలంగాణకు చెందిన ఏపీలో పనిచేస్తున్న  అధికారి