హైదరాబాద్, వెలుగు: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి రాష్ట్రాలు చట్టబద్ధంగా వైదొలిగేందుకు ‘ఎగ్జిట్ పాలసీ’ రూపంలో అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.
ఓపీఎస్ అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే రూ. 20 వేల కోట్ల ఆర్థిక ఉపశమనం లభిస్తుందన్నారు. ఎగ్జిట్ పాలసీని ఉపయోగించుకుని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని, వారి కోసం ప్రభుత్వం ప్రతి నెలా భారీ మొత్తంలో నిధులను కార్పస్ఫండ్లో జమ చేస్తోందని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు.
