అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు ఐఅండ్‌పీఆర్(సమాచార పౌరసంబంధాల శాఖ) అధికారులు గండికొడ్తున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగానే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని పైస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు అమలుచేయడం లేదు. -ఒక్క కాపీ ముద్రించని ఆన్ లైన్ పత్రికలకూ ఇష్టారాజ్యంగా కార్డులు జారీ చేస్తున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ, క్యూ ఆర్‌కోడ్‌తో క్వాలిటీగా అక్రెడిటేషన్ కార్డులను ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఇచ్చిన ఆదేశాలను ఐఅండ్ పీఆర్ అధికారులు తుంగలో తొక్కారు. మూడు విడతల్లో పంపిణీ చేసిన కార్డుల్లో ఏమాత్రం క్వాలిటీ లేదు. కార్డుల డిజైన్ అత్యంత పేలవంగా ఉండడంతోపాటు కార్డులపై పేర్లు కనిపించడం లేదు. రెండో విడత జారీ చేసిన కార్డుల్లో కొందరి ఫొటోలు సగం వరకు కట్ అయ్యాయని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్డుల ముద్రణను ఒక్కో దఫా ఒక్కో కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారని, ఈ క్రమంలో భారీగా చేతులు మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చార్టెడ్ అకౌంటెంట్ల పేరుతో జారీ చేసిన ఫేక్ సర్క్యులేషన్ సర్టిఫికెట్లు, డబ్బులు తీసుకొని ఊరూపేరూ లేని పేపర్లకు కార్డులు కట్టబెడ్తున్నారు. సర్క్యులేషన్‌కు సంబంధించి కీలకమైన పీఆర్జీఐ (ప్రెస్రిజిస్ట్రార్ జనరల్ఆఫ్ ఇండియా) సర్టిఫికెట్ ఉన్న ‘వెలుగు’ లాంటి దినపత్రికలో పనిచేసే మండల విలేకరులకు అక్రెడిటేషన్కార్డులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు.
