గత రెండేళ్లుగా రికార్డుల వేటతో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. వరుసగా 5 త్రైమాసికాల పాటు లాభాల బాటలో నడిచిన ఈ విలువైన లోహాలు.. జూన్ క్వార్టర్లో మాత్రం ఊహించని విధంగా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. జూన్ క్వార్టర్‌లో బంగారం ఏకంగా 12 శాతం మేర క్షీణించి.. 2016 డిసెంబర్ తర్వాత అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేసే దిశగా సాగుతోంది బంగారం ప్రయాణం.
మరోవైపు వెండి కూడా ఏకంగా 17.6 శాతం పడిపోయి.. నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతటి దారుణమైన నష్టాన్ని మూటగట్టుకుంది. ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ఈ లోహాలు.. తమ గరిష్ట ధరల నుంచి చూస్తే భారీగా దిగొచ్చాయి. ప్రపంచ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఔన్స్ బంగారం ధర మన కరెన్సీలో రూ. 5లక్షల 14వేల 615 రికార్డు స్థాయిని తాకగా.. అక్కడ నుండి ఇప్పుడు 24 శాతం పతనమైంది. అలాగే జనవరి 28న ఒక ఔన్స్ వెండి ధర రూ.11వేల 115 ఆల్‌టైమ్ హైని తాకి, ప్రస్తుతం అక్కడ నుంచి ఏకంగా 47 శాతం వరకు క్రాష్ అవ్వడం మార్కెట్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది.
ఈ అకస్మాత్తు తిరోగమనానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ సమీకరణాలే. అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వల్ల మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గి, క్రూడ్ ఆయిల్ ధరలు శాంతించాయి. ఇది నిజానికి మార్కెట్‌కు సానుకూల అంశమే అయినప్పటికీ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు బంగారంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫెడ్ కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా వడ్డీ రేట్ల పెంపునకు గట్టి మద్దతు ప్రకటించారు. ఆయన అనుసరిస్తున్న ఈ కఠినమైన వైఖరి కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి తప్పుకుంటున్నారు. దీనికి తోడు అమెరికా డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్ట స్థాయికి చేరడం, బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం కూడా బులియన్ మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఫెడ్ సమావేశం ముగిసినప్పటి నుండి డాలర్ విలువ ఒక శాతానికి పైగా పెరిగింది.
►ALSO READ | నెలకు లక్ష సంపాదిస్తున్నా రూపాయి కూడా దాయలేకపోతున్న ఇండియన్స్.. డబ్బంతా ఎక్కడికి పోతోంది..?
సాధారణంగా బంగారం, వెండిపై ఎలాంటి వడ్డీ రాదు. అందువల్ల మార్కెట్‌లో వడ్డీ రేట్లు "హయ్యర్-ఫర్-లాంగర్" ఉంటాయనే అంచనాలు ఉన్నప్పుడు.. ఇన్వెస్టర్లు బంగారం కంటే స్థిరమైన ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ ఇండెక్స్ 100 స్థాయి పైన ఉన్నంత కాలం బంగారం, వెండి ధరలు ఒత్తిడిలోనే కొనసాగుతాయని కమోడిటీ నిపుణులు అంటున్నారు.
వీటికి తోడు టెక్నాలజీ షేర్ల పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదని ఫెడ్ అధికారులు స్పష్టం చేస్తుండటంతో.. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. గురువారం విడుదల కానున్న యూస్ పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ప్రైస్ ఇండెక్స్ డేటాపైనే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల కళ్లు ఉన్నాయి.
