- డిజిటైజేషన్‌కు రాని ఎన్యుమరేషన్ ఫారాలు 73.95 లక్షలు
- సర్ మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,38,26,448
- ఇప్పటివరకు వివరాలు అందిన ఓటర్ల సంఖ్య 2,64,30,494
- తగ్గిన ఓటర్ల సంఖ్య (గ్యాప్) 73.95 లక్షలు సుమారుగా
- యూపీ, తమిళనాడు తర్వాత తెలంగాణలోనే హయ్యెస్ట్
- ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌కు ఇయ్యాల్నే లాస్ట్
- 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ ప్రకటించనున్న ఎన్నికల సంఘం
- క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల సమయం
- ఆ సమయంలో మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)తో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనున్నది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల తర్వాత సర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ లిస్టులో దేశంలోనే అత్యధికంగా ఓటర్ల సంఖ్య తగ్గిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలవనున్నది. నెలన్నర కిందటి వరకు జాబితాలో 3.38 కోట్ల ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2.64 కోట్లకు తగ్గుతోంది.
దాదాపు 47 రోజులపాటు సర్‌లో భాగంగా జరిగిన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ సోమవారం నాటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన దానిప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 22 శాతం ఓటర్ల వివరాలు డిజిటైజేషన్ కాలేదు. అంటే 73.95 లక్షల ఓటర్లు వారి ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వలేదు.
ఇక డిజిటైజేషన్ అయిన ఫారాల వివరాలతో ఆగస్టు17న సీఈఓ కార్యాలయం డ్రాఫ్ట్ (ముసాయిదా) ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనుంది. ఓటర్ల ఏరివేత వెనుక ఆబ్సెంట్, నివాసాల మార్పు, మరణాల వంటి ప్రధాన కారణాలు ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ రాబోయే నెల రోజుల పాటు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ సమయంలో తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు పక్కా అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో ఫైనల్ లిస్టు వరకు ఓటర్ల సంఖ్య కొంత మేరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల సర్ ప్రక్రియలో కూడా డ్రాఫ్ట్ దశతో పోలిస్తే ఫైనల్ జాబితా నాటికి కొంత శాతం మేరకు ఓట్లు పెరిగాయని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే నిర్వహించిన సర్ డ్రైవ్‌ను పరిశీలిస్తే, డ్రాఫ్ట్ లిస్టులో అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు ఉత్తరప్రదేశ్‌లో నమోదైంది. యూపీలో సుమారు 2.89 కోట్లు డ్రాఫ్ట్ లిస్టులో గాయబ్ అయ్యాయి. తర్వాత తమిళనాడులో 97 లక్షల ఓట్లు తగ్గాయి. ఈ రెండింటి తర్వాత తెలంగాణలో ఏకంగా 73.95 లక్షల ఓటర్ల వివరాలు ఇంకా నమోదు కాకపోవడంతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ 73.73 లక్షలు, పశ్చిమ బెంగాల్ దాదాపు 58 లక్షలు, ఏపీలో 44.89 లక్షలు, మధ్యప్రదేశ్ 42.74 లక్షల వంటి పెద్ద రాష్ట్రాలను సైతం దాటుకుని తెలంగాణ మూడో స్థానానికి చేరడం గమనార్హం.
హర్యానాలో 33.80 లక్షలు, చత్తీస్‌గఢ్‌లో 27.34 లక్షలు, కేరళలో 24.08 లక్షలు, ఒడిశాలో 20.12 లక్షల ఓటర్లు తగ్గారు. రాష్ట్రంలో ఓటర్ల డేటాను పరిశీలించినప్పుడు, ఏళ్లుగా డూప్లికేట్ కార్డులు, వలస వెళ్లిన వారి పేర్లు, మరణించిన వారి సమాచారం జాబితాల్లో అలానే ఉండిపోవడం, గ్రామాల్లో ఓటుతో పాటు వలస వెళ్లిన పట్టణాల్లోనూ మళ్లీ ఓటరు నమోదు చేసుకోవడం అలా ఒకరికే రెండు, మూడు ప్రాంతాల్లో ఓటర్ కార్డులు తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో డోర్ టు డోర్, ఈసీ నిబంధనల ప్రకారం పత్రాల పరిశీలనతో ఒకే ప్రాంతానికి ఓటర్లు పరిమితమయ్యారని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.
పల్లెల్లో ఎక్కువ.. పట్టణాల్లో తక్కువ
రాష్ట్రంలోని 33 జిల్లాల సర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పరిశీలిస్తే భౌగోళిక వ్యత్యాసాలు స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లోనే డిజిటైజేషన్ శాతాలు అత్యల్పంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ కేంద్ర భాగమైన హైదరాబాద్ జిల్లాలో 58.58% మాత్రమే డిజిటైజేషన్ పూర్తయింది. ఇక్కడ మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లలో 27.74 లక్షల మంది డేటా మాత్రమే ఆన్‌లైన్ అయింది. మేడ్చల్ మల్కాజిగిరిలో 63.82%, రంగారెడ్డిలో 64.91% మాత్రమే నమోదు కావడం గమనార్హం.
ఐటీ నిపుణులు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారి వద్దకు బీఎల్ఓలకు ప్రవేశం లభించకపోవడం, లేదా ప్రజలు ఫారాలు నింపి ఇవ్వడంలో ఉదాసీనత చూపడంతో పాటు చాలామంది ఓటర్ల అడ్రస్‌లు కూడా దొరకకపోడం, మరికొంతమంది ఉద్యోగాలు, వలస వచ్చిన వారు సొంతూళ్లలోనే ఓటు మ్యాపింగ్ చేసుకోవడమే కారణం.
మరోవైపు గ్రామీణ జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యం, అధికారుల పర్యవేక్షణ మెరుగ్గా ఉంది. దీంతో భువనగిరి జిల్లా అత్యధికంగా 94.30 శాతం డిజిటైజేషన్‌తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, జనగామ 91.69%, మహబూబాబాద్ 90.07%, మెదక్ 90.54%, సూర్యాపేట 90.43%, మరికొన్ని జిల్లాల్లో 80 శాతానికి పైగా నమోదు పూర్తయింది.
17న డ్రాఫ్ట్ లిస్టు.. మళ్లీ దరఖాస్తుకు చాన్స్
ఎన్నికల రూల్స్ ప్రకారం ఈ నెల10వ తేదీతో ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించడం, వాటిని డిజిటైజేషన్ చేసే ప్రక్రియ ముగియనుంది. వాస్తవానికి గత నెల 24వ తేదీనే గడువు ముగియాల్సి ఉండగా, ఒకసారి ఆగస్టు 3కు, ఆ తర్వాత ఆగస్టు10 వరకు అవకాశం పొడిగించింది. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు సేకరించిన చివరి నిమిషం డేటాను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
ఈ తుది డిజిటైజ్డ్ డేటా ఆధారంగా ఈ నెల 17న సీఈఓ ‘డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా’ను విడుదల చేయనున్నారు. ఈ జాబితా ప్రచురణతో ఎలక్షన్ కమిషన్ మొదటి విడత సంస్కరణలు పూర్తవుతాయి. పోలింగ్ స్టేషన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ జాబితాలను ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు, జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసులు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచనున్నారు. అయితే, సర్ ప్రక్రియలో భాగంగా తమ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోయినా లేదా తొలగింపునకు గురైనా అర్హులైన పౌరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ విడుదలైనప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్17 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో అర్హులైన ప్రతి పౌరుడికి మళ్లీ కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి లేదా సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓటు హక్కు కోల్పోయిన వారు లేదా కొత్తగా 18 ఏళ్లు నిండినవారు తమ నివాస ధ్రువీకరణ, వయస్సు ఆధారాలు (ఆధార్, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు తదితర ధ్రువపత్రాలు) జతచేసి ఫారమ్- 6 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా నేరుగా బీఎల్ఓల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే భారీగా తగ్గుదల
రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం మేర ఓటర్ల వివరాలు ఆన్‌లైన్ కాకపోవడం వెనుక ఎన్నికల సిబ్బంది నమోదు చేసిన ఆబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ వర్గీకరణే అత్యంత కీలకమైన అంశం. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లిన సమయంలో లభించని ‘ఆబ్సెంట్’ ఓటర్లు, ఉద్యోగాలు, ఉపాధి లేదా ఉన్నత చదువుల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్లిన ‘షిఫ్టెడ్’ ఓటర్లు, మరణించినప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్న ‘డెత్’ కేటగిరీ ఓటర్లే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణమయ్యారు.
ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు పట్టణ పరిధిలో అద్దె ఇళ్లు తరచూ మారే కుటుంబాల సమాచారం లభించకపోవడం వల్ల వారంతా ‘షిఫ్టెడ్’ జాబితా కిందకు వచ్చారు. అలాగే బోగస్ ఓట్లను, ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఉన్న డబుల్ ఓట్లను అధునాతన మ్యాపింగ్ సాంకేతికత ద్వారా గుర్తించి తొలగించడం ద్వారా ఓటర్ల సంఖ్య తగ్గింది. కొన్నిచోట్ల గ్రామాల్లో నివసించకుండా పట్టణాలకు మారిన వారి పేర్లు కూడా స్వగ్రామాల్లో తొలగింపునకు గురయ్యాయి.
