సర్కారు దవాఖానల్లో ఫ్రీగా ప్రైవేటు MRI.. మెషీన్ల కొనుగోలు, సిబ్బంది, నిర్వహణ అంతా ప్రైవేట్‌‌‌‌దే !

సర్కారు దవాఖానల్లో ఫ్రీగా ప్రైవేటు MRI.. మెషీన్ల కొనుగోలు, సిబ్బంది, నిర్వహణ అంతా ప్రైవేట్‌‌‌‌దే !
  • పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ‘పీపీపీ’ మోడల్లో సర్వీసు
  • నిజామాబాద్, మహబూబ్‌‌‌‌ నగర్, ఖమ్మం జీజీహెచ్‌‌‌‌లలో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌గా ప్రారంభించే యోచన
  • మెషీన్ల కొనుగోలు, సిబ్బంది, నిర్వహణ అంతా ప్రైవేట్‌‌‌‌దే
  • స్కాన్‌‌‌‌ల సంఖ్య ఆధారంగా సంస్థలకు చెల్లించేలా ప్రతిపాదనలు
  • నిరంతరాయ సేవల కోసం ఈ కొత్త విధానం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన, నిరంతరాయ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్)లో పబ్లిక్- ప్రైవేట్ పార్ట్‌‌‌‌నర్ షిప్ (పీపీపీ) మోడల్‌‌‌‌లో ఎమ్మారై మిషన్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద హాస్పిటల్స్‌‌‌‌లోనే అందుబాటులో ఉన్న ఎమ్మారై సేవలు కొన్నిసార్లు నిర్వహణ లోపంతో నిలిచిపోతుండటంతో, నిరుపేద రోగులు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఈ సమస్యకు చెక్ పెడుతూ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌‌‌‌ నగర్ జిల్లాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్)లో ఈ నూతన సేవలను ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చే రోగులకు ఇక్కడ అత్యంత ఆధునిక ఎమ్మారై సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి.

మెయింటెనెన్స్ సరిగ్గా లేక...
గతంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) టెండర్ ప్రక్రియ ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఎమ్మారై మెషీన్లను కొనుగోలు చేసేది. అయితే కంపెనీలతో ఉండే వారంటీ, ఉచిత నిర్వహణ గడువు ముగిశాక మెజారిటీ హాస్పిటల్స్ లో మెషీన్లు మూలనపడ్డాయి. ఎమ్మారై మెషీన్లలో కాంట్రాస్ట్, హీలియం గ్యాస్ నింపడం, కూలింగ్ సిస్టమ్స్ చెడిపోతే రిపేర్ చేయించడానికి హాస్పిటల్స్ వద్ద ప్రత్యేక బడ్జెట్ లేకపోవడం, ప్రభుత్వ అనుమతుల ప్రక్రియకు నెలల సమయం పట్టడంతో స్కాన్లు పూర్తిగా నిలిచిపోయేవి. 

దీంతో ప్రమాద బాధితులు, బ్రెయిన్, వెన్నుపాము, నరాల సమస్యలతో వచ్చే పేద రోగులను బయటి ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లకు పంపాల్సి వచ్చేది. అక్కడ ఒక్కో స్కాన్‌‌‌‌కు రూ.5,000 నుంచి రూ. 12,000 వరకు వసూలు చేస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడేవారు. దీనికి స్వస్తి పలికేందుకు సర్కారు పీపీపీ మోడల్‌‌‌‌ ను పరిశీలిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

కొనుగోలు, నిర్వహణ, సిబ్బంది అంతా ప్రైవేట్‌‌‌‌దే 
నూతన పీపీపీ విధానంలో ప్రభుత్వం హాస్పిటల్ ఆవరణలో కేవలం నిర్దేశిత స్థలం, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువజేసే ఎమ్మారై మెషీన్ల కొనుగోలు, నిపుణులైన రేడియాలజిస్టులు, రేడియో గ్రాఫర్లు, టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది నియామకం ప్రైవేట్ సంస్థలే చేపడతాయి. కూలింగ్ సిస్టమ్స్, సాఫ్ట్‌‌‌‌ వేర్ అప్‌‌‌‌ డేట్స్, కాంట్రాక్ట్ ఏజెంట్లు, రోజువారీ నిర్వహణ బాధ్యతలతో పాటు ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తితే 24 గంటల్లోగా పునరుద్ధరించాల్సిన బాధ్యత కూడా సదరు సంస్థలదే కానుంది.

డాక్టర్లు సిఫార్సు చేసిన స్కాన్లను పేద రోగులకు ఉచితంగానే అందిస్తారు. స్కాన్ల సంఖ్య ఆధారంగా సీజీహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ రేట్ల ప్రకారం ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. నకిలీ బిల్లులు అడ్డుకునేందుకు డిజిటల్ పీఎసీఎస్ రేడియాలజీ సిస్టమ్ అనుసంధానించడం వల్ల స్కాన్ రిపోర్టులు ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌లో డాక్టర్లకు అందుతాయి.

ఇతర రాష్ట్రాల్లో సక్సెస్
తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో పీపీపీ ఎమ్మారై విధానం విజయవంతంగా అమలవుతున్నది. తమిళనాడు హెల్త్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచితంగానే స్కాన్ సేవలు అందిస్తుండగా, మహారాష్ట్ర, గుజరాత్‌‌‌‌లలో ప్రమాద బాధితులకు వేగంగా ఎమర్జెన్సీ వైద్యం అందుతున్నది.

ఈ రాష్ట్రాల ప్లస్ మైనస్‌‌‌‌లను స్టడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఒక రోడ్‌‌‌‌ మాప్ సిద్ధం చేసినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. తొలిదశలో ఎంపిక చేసిన మూడు జిల్లాల జీజీహెచ్‌‌‌‌లలో వచ్చే ఫలితాలు, నిర్వహణ పనితీరును సమీక్షించిన అనంతరం ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఉమ్మడి జిల్లాల జీజీహెచ్‌‌‌‌లకు ఈ పీపీపీ ఎమ్మారై మోడల్‌‌‌‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నారు.