హైదరాబాద్ లో కోడికూర చిట్టిగారె రెస్టారెంట్ గురించి తెలిసే ఉంటుంది. అక్కడ బిర్యానీ సహా అన్ని ఐటమ్స్ కాస్త కాస్ట్ లీ గానే ఉంటాయి. హైదరాబాద్ లో బిర్యానీ యావరేజ్ రేట్లతో పోల్చితే దాదాపు డబుల్ ఉంటుంది. రేట్లేమో ఎక్కువ. కానీ మెయింటెనెన్స్ విషయంలో దారుణం. జూన్ 23న సైబరాబాద్ జోన్ లోని కంచి కేఫ్, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారేలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. చికెన్, డెజర్ట్స్ కి లేబుల్ లేనట్లు గుర్తించారు. లేబుల్స్ లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే తొలగించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం గమనించారు.
మెడికల్ ఫిట్‌నెస్, ప్యాకేజింగ్, మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు లేవని అధికారులు ఈ సందర్భంగా చెప్పారు. జిడ్డుగా మారిన కిచెన్ సీలింగ్‌ను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తే చర్యలు తప్పవని నోటీసులు జారీ చేశారు.
పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో మరీ దారుణం..
కంచి కేఫ్ లో మరీ దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. కిచెన్, స్టోర్ రూమ్ మధ్య ఓపెన్ డస్ట్ బిన్లు ఉండటంతో దుర్వాసన, ఈగల సమస్య ఉన్నట్లు గుర్తించారు. స్టోర్ రూమ్ సీలింగ్ పై దుమ్ము పేరుకుపోయి అధ్వానంగా తయారైంది.
గ్రైండింగ్, కూరగాయలు కట్ చేసే ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ఈగలు వాలుతున్నాయి. కాలీఫ్లవర్ పై ఫంగస్ పెరిగినట్లు గుర్తించారు. డ్రెయిన్ల వద్ద దుర్వాసన వెదజల్లుతుండటంతో అక్కడ నిలవలేని పరిస్థితి ఉన్నట్లు చెప్పారు.
ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన పిండిపై సరిగ్గా లేబులింగ్ లేదని అధికారులఉ తెలిపారు. కిచెన్, స్టోర్ రూమ్ లో ఈగలు, బొద్దింకలు తిరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. మెడికల్ ఫిట్ నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు అందుబాటులో లేవని చెప్పారు. ఫుడ్ లేబులింగ్, హౌస్ కీపింగ్ మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. కిచెన్ పరిస్థితులపై ఆగ్రహించిన అధికారులు నోటీసులు జారీ చేశారు.
