- నిధులు మంజూరైనా సాగని పనులు
- ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది. దాదాపు 90 శాతానికి పైగా పనులతో పాటు ట్రయల్ రన్ పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఎన్జీటీ, వనశక్తి,పెండింగ్ పరిహార కేసులు ఆటంకంగా మారుతున్నాయి.
ఇటీవల కాలువల నిర్మాణానికి నిధులు మంజూరై భూసేకరణ ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నా ప్రాజెక్టు ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. 2007లో ఈ ప్రాజెక్టును 1.22 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీని సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది.
మొత్తం 1,095 కోట్ల అంచనాతో 10.56 కి.మీ. మేర రిజర్వాయర్ కట్ట, 125 మీటర్ల టన్నెల్, సర్జ్ పూల్, పంప్‌హౌజ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు భారీ మోటర్లను బిగించి, అక్టోబర్ 2023 నాటికే 96 శాతం పనులు పూర్తి చేసి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు.
ఇది జరిగి దాదాపు మూడేండ్లు కావస్తున్నా న్యాయపరమైన చిక్కుల కారణంగా ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోలేదు. కాగా గౌరవెల్లి ప్రాజెక్టు పనుల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిరంతరం ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అడ్వకేట్ జనరల్ ,ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
న్యాయపరమైన చిక్కులే అడ్డంకి
గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభానికి న్యాయపరమైన చిక్కులు వెన్నాడుతూనే ఉన్నాయి. భూనిర్వాసితులు వేసిన కేసులతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), వనశక్తి కేసుల కారణంగా ప్రారంభానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులు కొలిక్కి రాకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభంపై ప్రభావం చూపుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల ఎన్జీటీ పనులను నిలిపేసింది. పర్యావరణ అనుమతుల కోసం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసినప్పటికీ తుది ఆమోదం పెండింగ్‌లో ఉంది.
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసినా అధికారులు తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు 2007 నుంచి భూనిర్వాసితులు తమ న్యాయమైన పరిహారం కోసం పోరాడుతుండగా 937 కుటుంబాలకు ఇండ్ల స్థలాలతో పాటు 104 మంది వివాహిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ప్యాకేజీతో పాటు మరో 42 ఎకరాలకు పైగా భూసేకరణ పరిహారం చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికి తోడు 124 ఇళ్లు కొత్త ముంపు ప్రాంతంలో ఉండటంతో నిర్వాసితులు అదనపు చెల్లింపులు కోరుతున్నారు.
ప్రాజెక్ట్‌తో హుస్నాబాద్ సస్యశ్యామలం
గౌరవెల్లి ప్రాజెక్ట్ తో హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో సాగునీరు, తాగునీటితోపాటు భూగర్భజలాల స్థాయి పెరగడంతోపాటు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారనున్నది. ఇప్పటివరకు రూ.1343.59 కోట్లు ఖర్చు చేయగా వీటిలో సివిల్ పనులకు రూ.886.76 కోట్లు, భూసేకరణ, పునరావాస ప్యాకేజీలకు రూ.456.83 కోట్లు ఖర్చు చేశారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా రూ.1457.97 కోట్లతో సవరించిన అంచనాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు నీరందనుంది. రివైజ్డ్ ఎస్టిమేషన్ లో రూ.431.30 కోట్లకు ప్రభుత్వం ఆమోదం లభించగా సివిల్ పనులకు రూ.205.74 కోట్లు, భూసేకరణ రూ.179.44 కోట్లు వినియోగించనున్నారు.
