రామచంద్రాపురం, వెలుగు : ప్లే స్కూల్ లో ఉండాల్సిన ఆరేండ్ల బాలుడు చెరువులో పడి చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ తెల్లాపూర్‌లోని ఫార్చ్యూర్ గ్రీన్స్కమ్యూనిటీలో ఉంటున్నాడు.
ఉదయ్ కిరణ్ తన కుమారుడైన షణ్ముక్(6)ను గురువారం ఉదయం తెల్లాపూర్‌లోని శిఖరం వండర్ నెస్ట్ప్లే స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్ కు వెళ్లాడు. 11 గంటల టైంలో షణ్ముక్ కనిపించడం లేదంటూ ప్లే స్కూల్ నిర్వాహకులు ఉదయ్ కిరణ్ కు ఫోన్ చేశారు.
స్కూల్ వద్దకు చేరుకున్న ఉదయ్ కిరణ్ సిబ్బందితో కలిసి చుట్టుపక్కల వెతకగా.. ఎదురుగా ఉన్న చెరువులో శవమై కనిపించాడు. బయటకు తీసి వెంటనే హాస్పిటల్ కు తరలించగా చిన్నారి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
స్కూల్ యాజమాన్యం బోనాల పండుగ సెలబ్రేషన్స్ లో ఉండి బాలుడిని పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొల్లూర్పోలీసులు తెలిపారు.
