ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులు తర్వాత తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యారంగంలో మార్పులు చేర్పులపై తెలంగాణలో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న 26 వేల పైచిలుకు ప్రభుత్వ బడులను 4 వేలకు కుదిస్తామనే ప్రకటన చేయగానే రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఏ ప్రభుత్వ బడిని మూసివేయడానికి వీలులేదని కోరాయి. ఉపాధ్యాయ సంఘాల బాటలోనే స్థానిక ప్రజలు కూడా బడుల మూసివేత ఆచరణ రూపం దాలిస్తే ఆందోళన బాటపట్టే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ప్రభుత్వం బడులు మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకున్నప్పటికీ రోజురోజుకూ నిర్వహణాలోపంతో కునారిల్లుతున్న ప్రభుత్వ బడులలో సంస్కరణలు అనివార్యం.
ఇప్పుడున్న ప్రభుత్వ బడులు మూసివేస్తే అది ప్రైవేటు విద్యా వ్యవస్థకు ఆయాచిత వరంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వ బడుల సంస్కరణకు ముందే ప్రైవేటు స్కూల్స్‌ను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంటే ప్రైవేటు పాఠశాలల్లో తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన విధంగా 5వ తరగతి నుంచే ప్రవేశపరీక్ష శిక్షణ నిషేధించాలి. కార్పొరేట్ పాఠశాలలు ఒక్కో పట్టణంలో 10 నుంచి 20వరకు తెరిచిన బ్రాంచీలు పర్మిషన్ రద్దుచేసి ఒక పట్టణానికి ఒకే పాఠశాలకు పరిమితం చేయాలి. ఈ చర్యల తర్వాతనే ప్రభుత్వ పాఠశాల సంస్కరణకు భౌతిక భద్రత, నమోదు గ్యారెంటీ లభిస్తుంది.
ప్రభుత్వ బడుల పునర్వ్యవస్థీకరణ
2023-–24 యూడైస్ గణాంకాలు ప్రకారం 30,022 వివిధ రకాల ప్రభుత్వ బడుల్లో గడిచిన రెండేళ్లుగా చాలా పాఠశాలల్లో సున్నా నమోదుతో సుమారు 4 వేల పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం 26వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలే ఉనికిలో ఉన్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ప్రకారం 19వేల ప్రాథమిక పాఠశాలల్లో 13వేల పైచిలుకు, 4,100 ప్రాథమికోన్నత, 5,500 ఉన్నత పాఠశాలల్లో నాలుగింట మూడొంతులు ప్రభుత్వ బడుల్లో 50లోపు విద్యార్థుల నమోదు ఉంది. కనుక వీటన్నింటిలో నమోదు క్షీణత వలన మూతదశకు చేరుకోవడంతోపాటు విద్యా నిధులు, వనరుల వృథా జరుగుతుంది. కనుక విద్యా సంస్కరణగా ప్రభుత్వ బడుల పునర్వ్యవస్థీకరణ అనివార్యత తక్షణం సూచికగా ముందుకువచ్చింది.
తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఇప్పుడు ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వ రంగంలో విద్య అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. యాక్సెస్ సౌకర్యం లేని హ్యాబిటేషన్స్ నుంచి ఈ పాఠశాలలకు ఉచిత ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అనేది గతంలో సర్వశిక్షా అభియాన్ సూచించిన ప్రత్యామ్నాయమే!
నిధుల వృథా అరికట్టాలి
ఇటీవల ప్రభుత్వ బడులను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు ప్లే స్కూల్ నుంచి 2వ తరగతివరకు ‘తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్’గా విస్తరించడంతోపాటు, ఉన్న వసతులను బట్టి మండలానికి నాలుగు నుంచి ఆరు ఉన్నత పాఠశాలలను ‘తెలంగాణా పబ్లిక్ స్కూల్స్’గా మార్చడం వలన ప్రభుత్వ విద్యారంగం దిద్దుబాటు సాధ్యం అవుతుంది.
ఇప్పుడు ఉన్న ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నాలుగువేల పాఠశాలలు లెక్కకు సరిపోతుంది. మండలం యూనిట్‌గా సంస్కరణ అమలు చేయడం, పాఠశాల సిబ్బందిని ఆయా కాంప్లెక్స్‌లకు కేటాయించడంవలన బోధనా సిబ్బంది కొరత తీరుతుంది.
సముచిత కేటాయింపు సాధ్యంతోపాటు విద్యారంగంలో నిధులు వృథాను అరికట్టవచ్చును. మూత పడ్డ పాఠశాల భవనాలు, వసతులు రైతు ధాన్యం నిలువ గోడౌన్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పశు వైద్య శాలలు, ప్రాథమిక పాఠశాలలైతే అంగన్‌వాడీ ప్లే స్కూల్‌గా ప్రత్యామ్నాయ ఉపయోగంలోకి తేవచ్చును. అనేక ఏండ్లుగా ప్రజల భాగస్వామ్యంతో నిర్మాణ రూపం సంతరించుకున్న ప్రభుత్వ బడి మూతపడడం ప్రజలకు అంత తొందరగా జీర్ణం కాకపోవచ్చు. కానీ, మారిన సామాజిక పరిస్థితులు, విద్యారంగంలో వస్తున్న వినూత్న మార్పులను ప్రజలు గ్రహించాలి.
దేశ భవిష్యత్తు రీత్యా
ప్రభుత్వ బడుల సంస్కరణ అనివార్యం తమ పిల్లలకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్య గ్యారెంటీని తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఎన్ని బడిబాటలు, విద్యా వారోత్సవాలు జరిపినా పెద్దగా ఫలితం ఉండదు. ఇక ప్రభుత్వ బడిని సంస్కరించడానికి ఏకైక ప్రత్యామ్నాయం ‘కామన్ స్కూల్’ విధానం మాత్రమే.
అంటే ఒక స్కూల్ క్యాచ్ మెంట్ ఏరియాలోకి మరో అదేరకం పాఠశాల లేకుండా ఏరియా స్థిరీకరణతోపాటు జిల్లా విద్యాబోధన సైతం సంస్కరించాలి. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా తదితర దేశాల్లో ప్రాథమికోన్నత విద్య ప్రభుత్వ రంగంలోనే ఉంది. మన పాలకులు విద్యను వ్యాపారంగా మార్చడం వలన భారతీయ విద్యావ్యవస్థలో విద్య అమ్మకం సరుకైంది.
ఇప్పుడు తిరిగి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను కామన్ స్కూల్ విధానంలోకి మార్చాలంటే పాలకులు చాలా శ్రమతోపాటు, ఒత్తిళ్లు ఎదుర్కోవాలి. అయితే దేశ భవిష్యత్తు, యువత అవసరాల రీత్యా ప్రభుత్వ బడి సంస్కరణ అనివార్యం. అదే క్రమంలో నూతన విద్యా విధానం -2020 ప్రకారం తెలంగాణ విద్యా ప్రణాళికలో సూచించినవిధంగా ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ’ ప్రకారం మానిటరింగ్ విధానం తీసుకురావాలి. అదేవిధంగా విద్యాహక్కు చట్టం -2009లోని ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ (సిసిఇ) ప్రక్రియను అన్నిస్థాయిల్లో పరిగణనలోనికి తీసుకోవాలి.
తెలంగాణ విద్యా ప్రణాళిక ప్రకారం ప్రైవేటు పాఠశాలల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ చిత్తశుద్ధితో చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నాలుగు వేల సమగ్ర, సంపూర్ణ కామన్ పాఠశాలలు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ వ్యవస్థీకరణతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులకు ప్రజలు కూడా తమవంతుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మౌలిక విద్యా అవసరాలు తీర్చే మార్పును ఆహ్వానిద్దాం.. స్వాగతిద్దాం.-
- ఎన్. తిర్మల్
విద్యా విశ్లేషకుడు
