స్పానిష్ భాషలో ఎల్‌నినో అంటే ‘చిన్న బాలుడు’ లేదా ‘క్రీస్తు శిశువు’ అని అర్థం. పసిఫిక్ మహాసముద్రంలోని, తూర్పు ప్రాంతాలలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీల సీ లేదా అంతకన్నా ఎక్కువగా.. కొన్ని నెలలపాటు లేదా సుమారు మూడు నెలలుపాటు కొనసాగితే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడ్డాయని అంటారు. సాధారణ పరిస్థితులలో ఈశాన్య గాలులు పసిఫిక్ మహా సముద్రపు వెచ్చని నీటిని పశ్చిమం వైపుకు నెట్టివేస్తాయి.
కాబట్టి పశ్చిమం వైపున (ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు) భారీ వర్షాలు పడతాయి. తూర్పు భాగంలో (దక్షిణ అమెరికా తీరాలవైపు, పెరూ / ఈక్వడార్) పొడి వాతావరణం ఏర్పడి తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. కానీ ఎల్‌నినో సమయంలో ఈశాన్య గాలులు బలహీనపడతాయి లేదా కొన్నిసార్లు వ్యతిరేక దిశలో అంటే తూర్పువైపుకు వీస్తాయి.
దీంతో వెచ్చని నీరు పశ్చిమం వైపుకు బదులుగా తూర్పువైపుకు నెట్టి వేయబడతాయి (దక్షిణ అమెరికా తీరాల వైపు). దీని వల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్య, తూర్పు భాగాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత 0.5డిగ్రీల సీ నుంచి 3 డిగ్రీల సీ వరకు పెరుగుతాయి. అంటే పశ్చిమం వైపున వర్షాలు తగ్గి కరువు ఏర్పడుతుంది.
- అతివృష్టి, అనావృష్టి
తూర్పు భాగంలో సాధారణంగా పొడిగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ఏర్పడతాయి. అంటే ఎల్‌నినో వలన ప్రపంచంలో ఒకవైపు కరువుతో అనావృష్టి వస్తే మరొకవైపు అధిక వర్షాలతో అతివృష్టి వస్తుంది. భారత దేశం పసిఫిక్ మహా సముద్రం పశ్చిమ భాగంలో లేదు. పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమాన ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాలు ఉంటాయి. భారతదేశం హిందూ మహాసముద్రం పరిధిలో ఉంది.
అయినప్పటికీ భారతదేశంపై ఎల్‌నినో ప్రభావం ఉండటానికి కారణం తూర్పు పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో వాతావరణ పీడనం అధికమవుతుంది. అందువలన భారతదేశానికి రుతుపవనాలను రప్పించే గాలులు బలహీనపడతాయి. ఫలితంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడి, సాధారణం కంటే తక్కువ వర్షపాతం, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్‌నినో ఒక ప్రకృతిసిద్ధమైన సహజ ప్రక్రియ.
ఒకసారి ఎల్‌నినో ఏర్పడితే సాధారణంగా 9-–12 నెలలు, కొన్ని సందర్భాల్లో 1–-2 సంవత్సరాలు కొనసాగుతుంది. ఎల్‌నినో వలన భారతదేశంలో బలహీనమైన మాన్సూన్ ఏర్పడుతుంది. దీనివల్ల వర్షపాతం సాధారణం కంటే 10-–20% తక్కువగా ఉంటుంది. కరువు, వ్యవసాయ నష్టాలు, నీటి కొరత ఏర్పడతాయి. వేడి తీవ్రత పెరుగుతుంది.
- ఎల్‌నినో ప్రభావాలను తగ్గించుకోవచ్చు
భారతదేశంలో ఎల్‌నినో ఇప్పటికే ఏర్పడింది. రాబోయే మాసాలలో ఇది సూపర్ ఎల్‌నినో స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితులు ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే అవకాశం ఉన్నది. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల వలన పెరూ, ఈక్వడార్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు మరింత తీవ్రంగా ఉండవచ్చు.
గతంలో కూడా బలమైన ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాల్లో ఈ దేశాల్లో తీవ్ర వరదలు, ఆస్తి నష్టాలు, వ్యవసాయం, మత్స్య సంపదపై ప్రభావం చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్‌నినోను నివారించే లేదా ఆపే సామర్థ్యం మన చేతుల్లో లేదు. కానీ దాని ప్రభావాలను, నష్టాలను తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది.
శాస్త్రవేత్తలు 6-–9 నెలల ముందే ఎల్‌నినో వస్తుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు కాబట్టి ముందుగానే తగు జాగ్రత్త చర్యలను తీసుకోవాలి. కరువు నిరోధక పంటలు, నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను వ్యవసాయ రంగంలో ఉపయోగించాలి. ఆనకట్టలు, జలాశయాలు, వర్షపు నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టాలి.
- పాజిటివ్ ఐఓడీ అంటే...
ఎల్‌నినో ప్రభావాలు ముందుగా అంచనా వేసినట్లుగా 100% కచ్చితంగా జరగవు. కొన్ని సందర్భాలలో అంచనాలు మారుతూ ఉంటాయి. వాతావరణం చాలా క్లిష్టమైన వ్యవస్థ కాబట్టి చిన్న మార్పులు కూడా పెద్ద తేడాను తెచ్చిపెట్టవచ్చు. పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్(పాజిటివ్ ఐఓడీ) వంటి ఇతర అంశాలు కొంతమేరకు ఎల్‌నినో ప్రభావాలను తగ్గించవచ్చును.
పాజిటివ్ ఐఓడీ అనేది హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఒక సహజమైన వాతావరణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో హిందూ మహాసముద్రం పశ్చిమభాగం (ఆఫ్రికా తీరం వైపు) వేడెక్కుతుంది. తూర్పుభాగం (ఇండోనేషియా- ఆస్ట్రేలియా వైపు) సాపేక్షంగా చల్లబడుతుంది.
దీనివల్ల భారతదేశం వైపు ఎక్కువ తేమ వస్తుంది. ఎల్‌నినో సాధారణంగా మాన్సూన్‌ను బలహీనపరుస్తుంది. కానీ పాజిటివ్ ఐఓడీ బలంగా ఉంటే, అది ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు లేదా సమతుల్యం చేయవచ్చు. ఫలితంగా తక్కువ వర్షం పడాల్సిన సంవత్సరంలో కూడా సాధారణంగా లేదా సాధారణస్థాయి కంటే కొంచెం ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది.
తటస్థ స్థితిలో పాజిటివ్ ఐఓడీ
1997లో అత్యంత తీవ్రమైన ఎల్‌నినో ప్రభావం భారతదేశ రుతుపవనాలపై పడింది. శాస్త్రవేత్తలు కరువుకు సిద్ధమయ్యారు. రైతులు అత్యంత దారుణమైన పరిస్థితికి సన్నద్ధమయ్యారు. కానీ, అప్పుడు ఏర్పడిన బలమైన పాజిటివ్ ఐఓడీ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడం వలన, ఎవరూ ఊహించని విధంగా భారతదేశంలో సాధారణం కంటే 2 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 2019వ సంవత్సరంలో ఏర్పడిన అత్యంత బలమైన పాజిటివ్ ఐఓడి అదే సమయంలో ప్రారంభమైన ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
దీనివల్ల వర్షాలు ప్రారంభంలో లోపించినప్పటికీ చివరికి దేశవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం భారతదేశంలో పాజిటివ్ ఐఓడీ బలంగా ఏర్పడలేదు తటస్థ, నిశ్చల స్థితిలో ఉంది. జపాన్ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం పాజిటివ్ ఐఓడీ జులై మాసంలో, భారత వాతావరణ సంస్థ, ఇతర వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పాజిటివ్ ఐఓడీ బలంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా భారతదేశంలో ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడి వర్షాలు పడే అవకాశం ఉన్నది.
- డా. శ్రీధరాల రాము
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్
ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
Note: వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
