తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత అల్లాణి శ్రీధర్ బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. కొమరం భీమ్ చిత్రం నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పిన శ్రీధర్, చివరి శ్వాస వరకు సినిమాల కోసం పనిచేయాలనేదే తన కోరిక అని చెప్పారు.
ప్రస్తుతం ఏఐ స్టూడియో ద్వారా సినిమాలు రూపొందిస్తున్నామని, ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 'ఏఐ 24 క్రాఫ్ట్స్ ను చంపదు.. వాటిని మరింత ముందుకు తీసుకెళ్తుంది. మన ఆలోచనలను మరింత మెరుగుపరచే సాధనం మాత్రమే' అని అన్నారు.
అలాగే నేటి కాలంలో పిల్లల కోసం సినిమాలు తగ్గిపోవ డం బాధాకరమని, బాలల చిత్రాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. సినిమా రంగంలో ప్రస్తుతం ఐడియాకే అత్యధిక విలువ ఉందని, కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయని పేర్కొన్న అల్లాణి శ్రీధర్, మంచి కథ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయని తెలియజేశారు.
