బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చేసే రైతులకు కమ్మర్‌పల్లి కొండా లక్ష్మణ్ బాపూజీ పసుపు పరిశోధన కేంద్రం వరంగా మారింది. కేంద్రంలో ఒక్కో మొక్క రూ.2కే ఒక్కొక్కరికి వెయ్యి నారు మొక్కలను అందిస్తున్నట్లు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విద్య తెలిపారు.
సోమవారం ఆమె పలువురు రైతులకు నారు పంపిణీ చేశారు. బయట మార్కెట్లో ఒక్కో మొక్క రూ.5 నుంచి రూ.10 వరకు ఉండగా, ఇక్కడ రూ.2కే లభిస్తోంది. దీంతో ఎకరాకు నారు ఖర్చు సుమారు రూ.2 వేలకు తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఈ నర్సరీలో నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో నారును పెంచి నేరుగా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు విద్య తెలిపారు. దుంపకుళ్లు, ఆకుపచ్చ తెగుళ్ల బెడద లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని వివరించారు.
ఈసారి పరిశోధన కేంద్రంలో లక్షా 20 వేల నారు మొక్కలు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే లక్ష వరకు పంపిణీ చేసినట్లు కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య ‘వెలుగు’కు తెలిపారు. గతంలో లక్షా 12 వేల నారు మొక్కలు, 30 క్వింటాళ్ల విత్తన పసుపు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
రైతులకు అవసరమైన దుగ్గిరాల ఎరుపు, సేలం, రాజపురి, రాజేంద్ర సోనియా వంటి అధిక దిగుబడి, అధిక కర్కుమిన్ శాతం కలిగిన రకాల నారును కేంద్రంలో పెంచుతున్నారు. అలాగే మారన్ రకం అల్లం నారును కూడా పెంచి పంపిణీ చేస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి రైతులు వచ్చి నారు తీసుకెళ్తున్నట్లు శాస్త్రవేత్త విద్య తెలిపారు.
