బాల్కొండ: ఎస్సారెస్పీకి 32,821 క్యూసెక్కుల ఇన్ఫ్లో

బాల్కొండ: ఎస్సారెస్పీకి 32,821 క్యూసెక్కుల ఇన్ఫ్లో

బాల్కొండ, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్  ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. బుధవారం సాయంత్రం 32,821 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091.00 అడుగులకు గాను, ప్రస్తుతం 1,077 అడుగులకు చేరింది. 80.51 టీఎంసీల ఫుల్​ కెపాసిటీకి గాను, ప్రస్తుతం 37.67 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్  ఆఫీసర్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు 1076.40 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం, సాయంత్రం 7 గంటలకు 1077.00 అడుగులకు చేరింది. గడిచిన24 గంటల్లో1.29 టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరింది. గత ఏడాది ఇదే రోజు నీటిమట్టం 1078.20 అడుగులు, 40.304 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్  భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

జూరాల 33 గేట్లు ఓపెన్

గద్వాల: కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్  డ్యామ్ లతో పాటు భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో బుధవారం జూరాల ప్రాజెక్టు 33 గేట్లను ఓపెన్  చేసి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఆల్మట్టి డ్యామ్​లో 92.76 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్  డ్యామ్ లో 14.47 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 1,45,376  క్యూసెక్కులను జూరాల డ్యామ్​కు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులో 3.70 టీఎంసీలు నిల్వ ఉంచుకొని, 33 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 2,18,130 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి ద్వారా 25,737 క్యూసెక్కులతో కలిపి 2,47,660 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.