- నీట మునిగిన 40 ఎకరాల వరి
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్‌లో ఊర చెరువు కట్ట తెగి పంటపొలాలు మునిగిపోయాయి. గ్రామ శివారులోని ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండు చోట్ల రోడ్లు దెబ్బతినగా, తూంపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎగువ కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో 91 ఎకరాల ఆయకట్టు ఉన్న ఊర చెరువు పూర్తిగా నిండింది. బుధవారం సాయంత్రం కట్టకు ఒకచోట గండి పడగా, నీటి లీకేజీ పెరిగి తెల్లవారుజామున కట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో చెరువులోని నీరంతా ఒక్కసారిగా బయటకు వెళ్లింది. వరద ఉధృతికి సుమారు 40 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి.
కొన్ని పొలాల్లో ఇసుక మేటలు పడ్డాయి. కొండాపూర్–సిరికొండ, తూంపల్లి–కొండాపూర్ రహదారుల మధ్య ఉన్న బ్రిడ్జిలు దెబ్బతినడంతో తూంపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పరిశీలించారు.
44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 14 ఎకరాలకు పైగా ఆక్రమణలు జరగడంతో కట్టపై ఒత్తిడి పెరిగి తెగిపోయిందని ఆయన అన్నారు. దసరా తరువాత చెరువుకు శాశ్వత మరమ్మతులు చేపడతామని చెప్పారు. దెబ్బతిన్న బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు చేపడుతామన్నారు. చెరువు ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
