ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచండి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్ విజ్ఞప్తి

ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచండి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్ విజ్ఞప్తి
  • సీఎంఆర్ గడువు పొడిగించాలని రిక్వెస్ట్‌‌‌‌
  • అదనపు ధాన్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐ ద్వారా తీసుకోవాలి: మంత్రి ఉత్తమ్
  • ఆయిల్ పామ్ విస్తరణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్: మంత్రి తుమ్మల

న్యూఢిల్లీ, వెలుగు: యాసంగి 2025–26 సీజన్‌‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి కొనుగోళ్లు జరిగాయని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సేకరణ లక్ష్యాలను వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రుల బృందం కోరింది.

అలాగే కస్టమ్ మిల్లింగ్‌‌ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో2026–27 వానాకాలం సీజన్‌‌కు సంబంధించి కేంద్రం నిర్ణయించే సేకరణ లక్ష్యాలు.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే ఉత్పత్తి, కొనుగోలు అంచనాలకు తగ్గట్టుగా ఉండాలన్నారు.

రైతుల పంటకు సకాలంలో మద్దతు ధర లభించాలంటే కేంద్ర లక్ష్యాలు, వాస్తవ ఉత్పత్తి పరిస్థితులు సమన్వయంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలోని ఆయన నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా.. కేంద్ర మంత్రికి ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మంత్రి ఉత్తమ్ కుమార్ అందజేశారు.

వానాకాలం, యాసంగి కలిపి 2025–26 మార్కెటింగ్ సీజన్‌‌లో తెలంగాణలో చరిత్రాత్మకంగా 152 లక్షల టన్నులకు (ఎల్ఎంటీ) పైగా వరి ధాన్యం సేకరణ జరిగిందని చెప్పారు. అయితే రాష్ట్రం పంపిన ఉత్పత్తి అంచనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాలను తక్కువగా నిర్ధారించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని వివరించారు. అలాగే, యాసంగి 2025–26 సీజన్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం 90 ఎల్ఎంటీల వరి సేకరణ అంచనాలు సమర్పించినప్పటికీ.. కేంద్రం కేవలం 35 ఎల్ఎంటీల బియ్యం (51.47 ఎల్ఎంటీ వరికి సమానం) మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని గుర్తు చేశారు. 

అయినప్పటికీ రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర లక్ష్యాలను మించి కొనుగోళ్లు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా తీవ్ర ఎండలు, హమాలీల కొరత, నిల్వ సామర్థ్య సమస్యలు, భారీగా వరి రాక, అకాల వర్షాలులాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కొనుగోలు చేసినట్టు వివరించారు. 

రైతుల నుంచి వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి, వారి ఆదాయాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. ఇలా గత మూడు సీజన్లలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి తెలంగాణ ప్రభుత్వం 69.50 ఎల్ఎంటీల వరిని అదనంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.16,446 కోట్ల అదనపు ఎంఎస్‌‌పీ భారం పడిందని మంత్రులు వెల్లడించారు. 

సీఎంఆర్ గడువు పెంచండి
యాసంగి 2024–25కు సంబంధించి ఇంకా 5 ఎల్ఎంటీల బియ్యం, వానాకాలం 2025–26కు సంబంధించి 14.24 ఎల్ఎంటీల బియ్యం కేంద్ర పూల్‌‌కు సరఫరా చేయాల్సి ఉందని మంత్రులు తెలిపారు. నిల్వ స్థలాల కొరత, ఒకేసారి పలు సీజన్ల కొనుగోళ్లు కొనసాగడం, మిల్లింగ్ సామర్థ్యాలపై ఒత్తిడిలాంటి కారణాల వల్ల గడువులు పొడిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యాసంగి 2024–25 సరఫరా గడువును మరో 60 రోజులు, వానాకాలం 2025–26 గడువును 120 రోజులు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, యాసంగి 2025–26 సేకరణ లక్ష్యాన్ని 35 ఎల్ఎంటీల బియ్యం నుంచి 54.50 ఎల్ఎంటీల బియ్యానికి పెంచాలన్నారు. వరి ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉండటంతో బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

రైతు ప్రయోజనాల్లో రాజీపడం: ఉత్తమ్
రైతు ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడబోదని మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర లభించేలా అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామన్నారు. భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ)కు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేసిందని తెలిపారు.  దేశంలోనే అత్యధికంగా 80.09 లక్షల టన్నుల వరిని సేకరించామని, కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. 

‘‘వాస్తవానికి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన లక్ష్యం 51 లక్షల  టన్నులు మాత్రమే. కానీ ఇప్పటివరకు మా ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. లక్ష్యాన్ని మించి అదనంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌‌సీఐ) ద్వారా కేంద్రం తీసుకోవాలి. గత మూడు సీజన్లలో రూ. 16,440 కోట్లతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేశాం’’ అని తెలిపారు.

పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహిస్తున్నం: మంత్రి తుమ్మల
తెలంగాణలో పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు  మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రం ముందుకు వెళ్లాలని కోరారు. గత రెండున్నరేండ్లలో ఆయిల్ పామ్ పండించే ఏరియాను పెద్ద ఎత్తున పెంచినట్టు చెప్పారు. ఆయిల్ పామ్  ఏరియా విస్తరణ, పెంపులో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.

అయితే ఆయిల్ పామ్‌‌పై దిగుమతి సుంకం తక్కువగా ఉండటం వల్ల దేశ రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దిగుమతి సుంకం పెంచి దేశంలో ఆయిల్ పామ్ పండించే రైతాంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో 10 లక్షలు ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించి,  దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలవబోతుందని వెల్లడించారు.