- పాత బ్లాక్ ఫీజులే వసూలు చేయాలని కోర్టు మధ్యంతర ఆదేశాలు
- సానుకూల తీర్పు రావడంతో మరో 10 కాలేజీలు కోర్టుకు..
- కౌంటర్‌కు సిద్ధమవుతున్న సాంకేతిక విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన టైమ్‌లో ఫీజుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో ఫీజులపై స్పష్టత లేకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. తాజాగా 18 ఇంజినీరింగ్ కాలేజీలు తమ ఫీజుల పెంపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ గందరగోళం మొదలైంది. కోర్టు ఆదేశాలతో అడ్మిషన్ల పోర్టల్‌లో ఫీజుల వివరాలను మార్చాల్సి రావడంతో అసలు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో తెలియక స్టూడెంట్లు అయోమయంలో పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా 157 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 2025–26 నుంచి 2027–28 విద్యాసంవత్సరాల వరకూ కొత్త ఫీజులను ప్రభుత్వం ఈ ఏడాది ఖరారు చేసింది. దీంట్లో 70 కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ 2022లో నిర్ణయించిన ఫీజులే అమలు కానున్నట్టు ప్రకటించింది. అయితే..19 కాలేజీల్లో ఫీజులు తగ్గగా, మరో 63 కాలేజీల్లోనే ఫీజులను పెంచారు. ఫీజుల పెంపుపై 18 కాలేజీలు ముందుగా హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి రిఫర్ చేసింది.
దీంతో మరోసారి మేనేజ్‌మెంట్లతో కమిటీ హియరింగ్ నిర్వహించి, పాత ఫీజులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో సదరు విద్యా సంస్థలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. తుది తీర్పు వచ్చే వరకు గత బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులనే వసూలు చేసుకోవాలని కాలేజీలకు వెసులుబాటు కల్పించింది.
వెబ్‌సైట్‌లో ఉండాల్సిందే..
ఇదే సమయంలో హైకోర్టు మరో కీలక ఆదేశం జారీ చేసింది. ఈ బ్లాక్ పీరియడ్ ప్రారంభంలో టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించిన (టెంటేటివ్) పెరిగిన ఫీజులు కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలని అడ్మిషనన్ల కన్వీనర్‌ను ఆదేశించింది. అంటే.. ఇప్పుడు పాత ఫీజు కట్టినప్పటికీ, కోర్టు తీర్పు మేనేజ్‌మెంట్లకు అనుకూలంగా వస్తే విద్యార్థులు పెరిగిన ఫీజును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో సీటు కేటాయింపు నుంచి కాలేజీలో చేరే వరకు ఫీజుపై ఉత్కంఠ కొనసాగనున్నది. 18 కాలేజీలకు కోర్టులో ఊరట లభించడంతో, మంగళవారం మరో 10 ఇంజినీరింగ్ కాలేజీలు కూడా హైకోర్టు గడప తొక్కాయి. అదే బాటలో మరిన్ని కాలేజీలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో మెజారిటీ కాలేజీల్లో ఫీజుల పెంపు వివాదం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
కౌంటర్‌కు సిద్ధమైన ఆఫీసర్లు
మరోవైపు మేనేజ్‌మెంట్ల తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులే ఫైనల్ అని, వీటిని సవాల్ చేస్తూ కాలేజీలు కోర్టుకు వెళ్లడంపై కౌంటర్ దాఖలు చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు రెడీ అయ్యారు. కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఫీజులు ఖరారు చేసిందని, దీనిపై కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని వారు చెబుతున్నారు.
