సూర్యాపేట మెప్మాలో భారీ అక్రమాలు ! నలుగురు ఆర్పీలపై కలెక్టర్ వేటు

సూర్యాపేట మెప్మాలో భారీ అక్రమాలు ! నలుగురు ఆర్పీలపై కలెక్టర్ వేటు

సూర్యాపేట/కోదాడ, వెలుగు: పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటైన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) సూర్యాపేట జిల్లాలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌గా మారింది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అండగా ఉండాల్సిన అధికారుల నిర్లక్ష్యం, కొందరు సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) స్వార్థంతో ఈ సంస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. కోదాడ మెప్మా పరిధిలో సంఘం సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా, కేవలం లీడర్లే సొంతంగా తీర్మానాలు చేసుకుంటూ బ్యాంకుల నుంచి లక్షలాది రూపాయల రుణాలు తీసుకుంటున్నారు.

రికవరీ నోటీసులు రావడంతో మహిళా సంఘాల సభ్యులు విస్తుపోయి లీడర్ల ఇండ్లను ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అక్రమాలకు తోడు గ్రూపులకు రుణాలు మంజూరు కావాలంటే మెప్మా సీవోల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్లు ఇస్తేనే లోన్లు మంజూరవుతాయని నమ్మిస్తూ, లబ్ధిదారుల చేతికి డబ్బులు రాగానే అందులో నుంచే కట్ చేసి పంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు.. చర్యలు
ఈ వరుస అవినీతి భాగోతంపై బాధితులు ఆధారాలతో సహా సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తీవ్రంగా స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించగా, మెప్మా ఉన్నతాధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఆర్పీల అక్రమాలు నిర్ధారణ అయ్యాయి. అర్హులైన వారిని పక్కనబెట్టి సంతకాలు ఫోర్జరీ చేసి మరీ లోన్లు డ్రా చేసినట్లు తేలింది.

కోదాడ పరిధిలోని రెండు సంఘాల్లో సభ్యులకు తెలియకుండా రూ.5 లక్షల రుణాలు తీసుకున్నట్లు, సూర్యాపేట పరిధిలోని మరో రెండు సంఘాల్లో రికార్డులు సరిగ్గా నిర్వహించకుండా కమీషన్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. విచారణ నివేదిక ఆధారంగా  అవినీతికి పాల్పడిన ఇద్దరు ఆర్పీలపై కేసులు నమోదు చేయించడంతో పాటు, మరో ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కాంలో భాగస్వామ్యమున్న మిగిలిన సిబ్బంది, అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.