రక్షకులే భక్షకులయ్యారు.. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

రక్షకులే భక్షకులయ్యారు.. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 
  • ఎన్‌‌టీఏ బాధ్యతలను కొందరు టీచర్లు దుర్వినియోగం చేశారు
  • లీకేజీల వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుతామని వెల్లడి

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్‌‌ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకమైన స్థానాల్లో ఉండి పరీక్షలను సజావుగా నిర్వహించాల్సిన వారే మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రక్షకులే భక్షకులయ్యారంటూ ఈ వివాదంపై మంగళవారం ఓ నేషనల్‌‌ మీడియా ఎదుట తొలిసారిగా ఆయన స్పందించారు.  

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నమ్మి అప్పగించిన బాధ్యతలను కొందరు ఉపాధ్యాయులు దుర్వినియోగం చేశారని ఫైర్‌‌‌‌ అయ్యారు. ‘‘ఎంతో నమ్మకంతో  కొందరు ఉపాధ్యాయులకు ఎన్టీఏ ఈ పరీక్షల బాధ్యతలను అప్పగించింది. కానీ, వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణగా నిలవాల్సిన వారే.. వారి జీవితాలను దెబ్బతీశారు”అని పేర్కొన్నారు. 

ఈ వివాదం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఇటీవలి కాలంలో పలువురు నీట్ అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆ విద్యార్థుల మరణాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని  ప్రకటించారు.