లోనావాలా: మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడనుకున్న బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. అతడి కాబోయే భార్యే, ప్రియుడితో కలిసి లోయలోకి నెట్టి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
దీంతో ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌తో వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది నవంబర్‌లో పెండ్లి జరగాల్సి ఉంది. జూన్ 18న సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు కలిసి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే కోటపై ఫొటోలకు పోజులు ఇస్తుండగా కేతన్ కాలుజారి లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ మూడు గంటలపాటు శ్రమించి లోయ నుంచి కేతన్ మృతదేహాన్ని వెలికితీసింది.
మొబైల్ డేటాతో నిజం వెలుగులోకి..
ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసును నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సియాను ప్రశ్నించగా పొంతనలేని జవాబులిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. నిందితురాలి మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, స్పాట్‌లో ఉన్న మరికొందరి స్టేట్‌మెంట్లను సేకరించగా అసలు నిజం బయటపడింది.
కేతన్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సియా, తన పుట్టినరోజు నెపంతో అతడిని లోహగఢ్ కోటకు పిలిపించింది. అక్కడ సమయం చూసి ప్రియుడు చేతన్ సహాయంతో కేతన్‌ను లోయలోకి నెట్టేసింది.
