- ఆ తర్వాత సిటీ మొత్తం క్లియర్ చేయండి
హైదరాబాద్, వెలుగు: ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియను హైకోర్టు నుంచే ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు పరిసరాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల పాదచారులు, న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. హైకోర్టు నుంచి మొదలుపెట్టిన ఈ ఆక్రమణల తొలగింపు చర్యలను సిటీ అంతటా విస్తరించాలని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లను రక్షించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ సీనియర్ సిటిజన్ బి. సురేందర్‌తో సహా ముగ్గురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ ఇటీవల విచారించారు.
గత మే 4న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కోర్టులు ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అధికారులను ప్రశ్నించింది.
నిబంధనలను ఉల్లంఘించిన వారికి, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయరాదని ‘శాంతి స్పోర్ట్స్ క్లబ్’, ‘ఈశా ఏక్తా అపార్ట్‌మెంట్స్ హౌసింగ్ సొసైటీ వర్సెస్ ముంబై కార్పొరేషన్’ కేసుల్లో సుప్రీంకోర్టు గతంలోనే తీర్పులు ఇచ్చిందని హైకోర్టు గుర్తుచేసింది. అదేవిధంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి బుల్‌డోజర్ల కేసులోనూ సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేసిందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్న తర్వాత వాటిని తొలగింపునకు అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. మే 4న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగింపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
