- హైదరాబాద్‌లో మూడు ఇండ్లు, 8 ఓపెన్ ప్లాట్లు, ఉప్పల్‌లో కమర్షియల్ బిల్డింగ్
హైదరాబాద్/నిజామాబాద్, వెలుగు: అవినీతి అధికారులపై ఏసీబీ అధికారుల దాడులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇంటితోపాటు మొత్తం 11 చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ప్రగతినగర్, హైదరాబాద్‌లోని మచ్చబొల్లారంలోని మల్లారెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, బినామీలు, అనుబంధ వ్యక్తులకు చెందిన ఇళ్లలో మంగళవారం ఏకకాలంలో సోదాలు కొనసాగాయి.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో స్థిర, చరాస్తులు సహా మొత్తం రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ డీజీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడైన మల్లారెడ్డిని అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం బుధవారం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించనున్నారు.
రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు స్వాధీనం
మచ్చబొల్లారంలోని మల్లారెడ్డి ఇంట్లో రూ.3.31 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, మల్లారెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు లాకర్లను సీజ్ చేశారు. వీటితో పాటు హైదరాబాద్‌లో మూడు ఇండ్లు, ఎనిమిది ఓపెన్ ప్లాట్లు , ఉప్పల్‌లో కమర్షియల్ బిల్డింగ్‌తో పాటు, చేర్యాలలో ఓ ఇంటికి చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల మండలం మద్దూరులో 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. మూడు లాకర్లను ఓపెన్ చేస్తే మరికొన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
