ఆదిలాబాద్ అభివృద్ధికి గేట్‌‌‌‌‌‌‌‌వేగా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ అభివృద్ధికి గేట్‌‌‌‌‌‌‌‌వేగా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్: ఎమ్మెల్యే పాయల్ శంకర్
  • భూ సేకరణ పూర్తి కాగానే ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
  • త్వరలోనే రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ అభివృద్ధికి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ గేట్ వేగా నిలవబోతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు. మంగళవారం స్థానిక క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ నిర్మాణంపై సోమవారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన సమావేశంలో కీలక అవగాహన కుదిరిందన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ కోసం ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలిపారు.

ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 80 ఎకరాలు తక్షణమే కేటాయించి టెర్మినల్ భవనం, విమాన రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒప్పందం కుదిరిందని చెప్పారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.340 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.600 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

భూసేకరణ నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారని తెలిపారు. విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేక హ్యాంగర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనవసర రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు.

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి-రాంపూర్ మధ్య రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి  త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. ఒకటి, రెండేండ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. సమావేశంలో నాయకులు జోగు రవి, పోశన్న, ధోని జ్యోతి, దయాకర్, నరేశ్, విలాస్, రాకేశ్, బీన్స్ రెడ్డి పాల్గొన్నారు.