లేని బొగ్గును సృష్టించి లాభాల పేరుతో దగా: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

లేని బొగ్గును సృష్టించి లాభాల పేరుతో దగా: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
  • కాంగ్రెస్ హయాంలో సింగరేణి స్కాంలమయంగా మారింది
  • భట్టి పుణ్యమాని అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న సింగరేణి 
  • సింగరేణి స్కాంపై సెంట్రల్​ విజిలెన్స్, సీబీఐతో విచారణ జరిపించాలి: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కాంగ్రెస్ హయంలో సింగరేణి స్కాంలమయంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్​రావు ఆరోపించారు. సింగరేణి పరిరక్షణ పేరుతో మంగళవారం రాత్రి భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని క్లబ్​లో నిర్వహించిన సదస్సులో హరీశ్​రావు పవర్​పాయింట్​ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లేని బొగ్గును సృష్టించి సింగరేణిని దగా చేస్తున్నారని, లాభాలు అంటూనే ఓడీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు గురించి సింగరేణిగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ మాట్లాడడం లేదన్నారు.

రెండు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను ప్రత్యక్షంగా చూసేందుకు తమకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమాని సింగరేణి అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోందన్నారు. సైట్​విజిట్ సర్టిఫికెట్​ పేర సింగరేణిలో భారీ స్కాం జరిగిందని, సీఎం రేవంత్​రెడ్డి బావమరిదికి కొత్తగూడెంలోని వీకే ఓసీ ఓబీ టెండర్ ఎలా వచ్చిందన్నారు. గతంలో లెస్ టెండర్లుంటే కాంగ్రెస్​హయంలో ఎక్సెస్​ టెండర్లు వేస్తూ కాంట్రాక్టర్లకు లాభం చేకూరుస్తున్నారని విమర్శించారు. ఎక్స్​ప్లోజివ్స్ లో దాదాపు రూ. 300 కోట్ల అదనపు భారం సంస్థపై పడిందన్నారు.

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్​ఎస్ ​హయంలో రూ. 7,355 కోట్ల బకాయిలు ఉంటే.. కాంగ్రెస్​ హయంలో రూ. 19,733 కోట్లకు పెరిగిందన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన లాభాల్లో రూ. 6,315 కోట్లు పక్కన పెట్టామని యాజమాన్యం చెప్పిందని.. మరి అలాంటప్పుడు ఓడీ కోసం బ్యాంకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. సోలార్​పేరుతో సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 

గతంలో సింగరేణి సంస్థకు ఫిక్స్​డ్​డిపాజిట్లు ఉంటే ఇప్పుడేమో అప్పుల కోసం తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గొప్పలకు పోయి సింగరేణిని దివాళా తీయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎల్​పీలో రెండేండ్లుగా బొగ్గు ఉత్పత్తి జరగకున్నా 1,83,791 టన్నుల బొగ్గు స్టాక్​చూపించడం దారుణమన్నారు.

డీజిల్ స్కాం కారణంగా సింగరేణిపై రూ. వందల కోట్లలో అదనపు భారం పడిందన్నారు. కాంగ్రెస్​ హటావో.. సింగరేణి బచావో పేరుతో మరో ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. సింగరేణిలో జరుగుతున్న స్కాంలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్​రెడ్డి సెంట్రల్​విజిలెన్స్, సీబీఐతో విచారణ జరిపించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీశ్ రావు సవాల్ చేశారు.

కార్యక్రమంలో టీబీజీకేఎస్​ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, మాజీమంత్రి పువ్వాడ అజయ్​ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, బానోత్​ హరిప్రియ పాల్గొన్నారు. 

కూనంనేని స్కాంల పక్షమా.. కార్మికుల పక్షమా.. 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్మికుల పక్షం ఉంటారో.. స్కాంల పక్షమో స్పష్టం చేయాలని హరీశ్​రావు డిమాండ్ చేశారు. సింగరేణిలో కోల్​స్కాం జరగలేదని కూనంనేని చెప్తున్నారని, స్టాక్​ చూసేందుకు మీతో రావడానికి తాము సిద్దంగా ఉన్నామని, తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.