అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. అభివృద్ధి పనులకు సంబంధించి రూ.52 లక్షల బిల్లు పెండింగ్

అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య.. అభివృద్ధి పనులకు సంబంధించి రూ.52 లక్షల బిల్లు పెండింగ్
  • సర్పంచ్, ఉపసర్పంచ్, సెక్రటరీ, వార్డు మెంబరే కారణమని సూసైడ్ నోట్
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ఘటన

హుస్నాబాద్, వెలుగు: చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల రాక, అప్పుల బాధ తట్టుకోలేక ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మదాపూర్ గ్రామానికి చెందిన పిట్టల సంపత్ (45) గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్ గా పనిచేసి పలు అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. 

ఈ పనులకు సంబంధించి సుమారు రూ.52 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లుల కోసం ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందికపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో నాలుగైదు రోజుల కింద హుస్నాబాద్ లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. గమనించిన కుటుంబసభ్యులు కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. అదే బాధలో ఉన్న సంపత్ మంగళవారం గ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తనకు పెండింగ్ బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇందుకు సర్పంచ్ భర్త జిల్లెల తిరుపతి, ఉప సర్పంచ్ కత్తుల సమ్మిరాజు, సెక్రటరీ హరిబాబు, పదో వార్డు మెంబర్ బొల్లి తిరుపతి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. మృతుడి కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హాస్పిటల్ వద్ద ఆందోళన
పోస్ట్ మార్టం కోసం సంపత్ డెడ్ బాడీని హుస్నాబాద్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ లీడర్లు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని హుస్నాబాద్, కరీంనగర్ రోడ్డుపై బైఠాయించారు.

సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని నాయకులకు నచ్చజెప్పారు. కార్యక్రమంలో పందిళ్ల సర్పంచ్ తోడేటి రమేశ్, మాజీ సర్పంచ్ గద్దల రమేశ్, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.